బీసీలపై వైసీపీ పగ
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:06 AM
బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై వైసీపీ నేత జగన్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చూపారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
34 శాతం రిజర్వేషన్‌పై జగన్‌ది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం: సీఎం
నాడు కావాలనే బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేశారు
ఇప్పుడూ తప్పుడు కేసులతో బీసీ కోటాను అడ్డుకున్నారు
34 శాతం కన్నా ఎక్కువ సీట్లే ఇచ్చి న్యాయం చేద్దాం: సీఎం
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై వైసీపీ నేత జగన్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చూపారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా వైసీపీ కోర్టులో పిటిషన్లు వేయకుండా ఉంటే 34 శాతం రిజర్వేషన్లు సజావుగా అమలయ్యేవని తెలిపారు. శనివారం ప్రత్యేక క్యాబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. బీసీల పట్ల వైసీపీ వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా సీఎం ఎత్తిచూపుతూ, మాట్లాడారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీంకోర్టు మూడు తప్పనిసరి నిబంధనలను ట్రిపుల్ టెస్ట్ పేరుతో విధించింది. అందులో బీసీ జనాభాను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఒకటి. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల నిర్ధారణ రెండోది. 50 శాతం పరిమితి పాటించడం మూడోది. జగన్ డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ జీవో ఇచ్చారు.
దాన్ని హైకోర్టు కొట్టివేసింది. దానిపై కనీసం అప్పీల్ చేసే ప్రయత్నం కూడా జగన్ చేయలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. బీసీలకు రాజకీయాధికారం కల్పించడంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైందని గుర్తుచేశారు. డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే ఉత్తుత్తి జీవోలు ఇవ్వడం, మనం డెడికేటెడ్ కమిషన్ వేసి పక్కాగా రిజర్వేషన్లు అమలు చేసే సమయానికి దానిపై కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం...ఇవన్నీ బీసీలపై వైసీపీకి ఉన్న చిన్నచూపును చాటే విషయాలని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘బీసీలకు తొలి నుంచీ టీడీపీ వెన్నెముకగా నిలిచింది. 34 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో భాగంగా చట్టబద్ధంగా వారికి ఎంత వరకు న్యాయం చేయాలో చేద్దాం. పార్టీ పరంగా కూడా న్యాయం చేద్దాం.’’ అని సీఎం అన్నారు.
అప్పట్లో హైకోర్టు కొట్టివేసిన వెంటనే వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కాదని కొందరు మంత్రులు అన్నారు. బీసీలకు రాజకీయ అధికారం దక్కకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కోర్టులు కొట్టివేసినా డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసినా బీసీలకు 24 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు లభిస్తాయని సీఎం అన్నారు. పట్టణాల్లో బీసీ జనాభా బాగా పెరిగిందని, దానికి అనుగుణంగా వారికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీసీలకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 24శాతం రిజర్వేషన్ కల్పించాం. మీ హయాంలో (చంద్రబాబు) 34 శాతానికి పెంచాం. వైసీపీ అసమర్థత వల్ల మళ్లీ 24 శాతానికి తగ్గిపోయాయి.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
గెలుపు బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే
కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. మూడు పార్టీల నడుమ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌చార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. నవంబరు 15 నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనపై దృష్టి సారిద్దామని మంత్రులతో వ్యాఖ్యానించారు.
జడ్పీలకు కొత్త రోస్టర్
కొత్త జిల్లాలతోపాటు కొత్తగా జిల్లా పరిషత్‌లను కూడా ఏర్పాటు చేయడంతో మొత్తం 28 జిల్లా పరిషత్‌లు అయ్యాయని, వీటన్నింటికీ రిజర్వేషన్ అమలు విధానం ఎలా అన్నదానిపై సమావేశంలో మంత్రులతో సీఎం చర్చించారు. గతంలో ఉన్న 13 జడ్పీలతోపాటు కొత్తగా 15 జడ్పీలు ఏర్పాటైనందున పాత రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా కొత్తగా రోస్టర్ అమలు చేద్దామని అధికారులు సీఎంకు వివరించారు.
ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోటి రూపాయలు ఇచ్చేందుకు సీఎం సుముఖత తెలిపారు. ఈనెల 12 లేదా 13 తేదీల్లో నిధులను విడుదల చేస్తామని సీఎం చెప్పారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం లోటు వర్షపాతం ఉన్నా, ముందస్తు ప్రణాళిక కారణంగా పంట దిగుబడులు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి రైతులు విత్తనాలపై చేసిన ఖర్చు నష్టపోకుండా పీడీఎంఎస్ విత్తనాలు సరఫరా చేయాలని సూచించామని, మీ జిల్లాల పరిధిలో ఎంత మందికి ఇచ్చామో చెప్పగలరా అని మంత్రులను సీఎం ప్రశ్నించగా, అధికశాతం మంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మంత్రులు మొక్కుబడిగా సమావేశాలకు రావడం కాదని, సమావేశాల్లో చర్చించిన అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. మంత్రులందరూ తమ శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంబంధాలు పెంచుకోవాలన్నారు.
మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పితృ దేవతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్; స్పెయిన్ పర్యటనలో ఉండటంతో దుర్గేశ్ సమావేశానికి హాజరు కాలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం