పట్టణాల రూపురేఖలు మార్చే ‘హ్యామ్’
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:40 AM
రాష్ట్రంలోని నగర, పురపాలక సంస్థల్లో మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం-హ్యామ్)ను అమలు చేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రల్ మీడియన్లు, స్ర్టీట్ లైటింగ్, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులను ఒకేసారి అభివృద్ధి చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది.
7,469 కోట్లతో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టు
40:60 నిష్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం
చిత్తూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నగర, పురపాలక సంస్థల్లో మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం-హ్యామ్)ను అమలు చేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రల్ మీడియన్లు, స్ర్టీట్ లైటింగ్, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులను ఒకేసారి అభివృద్ధి చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం కుప్పం నుంచి ప్రారంభించారు. హెచ్‌ఏఎం ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.7,469 కోట్ల పరిపాలనా అనుమతిచ్చింది. ఇందులో రూ.5,500 కోట్లను ప్రాజెక్టు వ్యయంగా, మరో రూ.1,969 కోట్లను పదేళ్ల కాలానికి సంబంధించిన వడ్డీగా నిర్ణయించారు. ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక ఆర్థిక నమూనాను రూపొందించారు. మొత్తం వ్యయంలో 40 శాతం అంటే రూ.2,200 కోట్లను ఎల్‌ఆర్‌ఎ్‌స/బీపీఎస్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. మిగిలిన 60శాతాన్ని హెచ్‌ఏఎం కింద ఎంపికయ్యే కన్సెషనర్ (కాంట్రాక్టరు) సమకూరుస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో 40 త్రైమాసిక యాన్యుటీ వాయిదాలుగా తిరిగి చెల్లించనుంది. మున్సిపాలిటీలపై ఆర్థిక భారం లేకుండా పనులు పూర్తిచేయనున్నారు.
117 పట్టణాలకు 17 ప్యాకేజీలు
రోడ్లు, డ్రెయిన్లు, మీడియన్లు, స్ర్టీట్ లైటింగ్, పార్కుల పనులను 17 ప్యాకేజీలుగా విభజించారు. 5 పబ్లిక్ హెల్త్ సర్కిళ్ల పరిధిలోని 17 జిల్లాల్లో 117 మున్సిపాలిటీలను ఈ ప్యాకేజీల్లో చేర్చారు. ఈ పనులకు మొత్తం రూ.4,289కోట్ల మేర అంచనా వ్యయాన్ని రూపొందించారు. 2,165 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. 502 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. సుమారు 210 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్లను ఏర్పాటుతో పాటు సుమారు 391 కిలోమీటర్ల మేర లైటింగ్ పనులు చేపడతారు. కుప్పం, పిఠాపురం, మంగళగిరి మున్సిపాలిటీల్లో యూజీడీ నిర్మాణాలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈ మూడుచోట్ల కలిపి రూ.650 కోట్లతో పనులు చేయనున్నారు. హెచ్‌ఏఎం కింద చేపట్టే 17 రోడ్ల ప్యాకేజీలకు టెండర్లను ఇప్పటికే పిలిచారు. అన్ని ప్యాకేజీలకు లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌వోఏ)లను సెప్టెంబరు 30 నాటికి జారీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టే పనులు 2028 చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం