Share News

‘పుర’ వైభవం!

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:43 AM

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టణాలే గ్రోత్‌ ఇంజన్లుగా మారుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.

‘పుర’ వైభవం!

  • 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల పనులకు శ్రీకారం

  • కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22,330 కోట్ల పనులు

  • మరో 6 నెలల్లో ఇంకో 17 వేల కోట్ల పనులు

  • మొత్తం రూ.50 వేల కోట్లతో చేపడుతున్నాం

  • ఇవి పూర్తయితే రాష్ట్రం దశ-దిశ మారతాయ్‌

  • మున్సిపల్‌ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం

  • 2047 నాటికి ప్రతిదీ ‘స్వర్ణ మున్సిపాలిటీ’యే

  • వీకెండ్‌ ఎకానమీ పెంచేలా చర్యలు: సీఎం

  • కుప్పంలో హంద్రీ-నీవా జలాలకు జలహారతి

  • ముగిసిన రెండ్రోజుల పర్యటన

కుప్పం/అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టణాలే గ్రోత్‌ ఇంజన్లుగా మారుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంగళవారం కుప్పం నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి పురపాలక చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామని చెప్పారు. ‘రెండేళ్లుగా సంక్లిష్ట పరిస్థితుల్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాం. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.22,330 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. మరో 6నెలల్లో రూ.17వేల కోట్ల పనులు ప్రారంభిస్తాం. మొత్తం రూ.50 వేల కోట్ల విలువైన పనులు పూర్తయితే రాష్ట్రం దశ-దిశ మారతాయి’ అని తెలిపారు. పట్టణాల్లో రోడ్లు, పార్కులు, సెంట్రల్‌ మీడియన్లు, సీవరేజీ పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు. పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టిన మంత్రి పి.నారాయణ, అధికారులను సీఎం అభినందించారు. పట్టణ స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడకుండా హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం)లో తొలిసారిగా భారీస్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ‘123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.7,469 కోట్లతో పనులు చేపడుతున్నాం. రోడ్ల నిర్మాణానికి 4,656 కోట్లు కేటాయించాం. 2,165 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. పట్టణాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, కమిషనర్లు శ్రద్ధ పెట్టాలన్నారు.


మెరుగైన నివాస యోగ్యత..

పట్టణ ప్రాంతాల్లో మెరుగైన నివాస యోగ్యత ఉండాలని చంద్రబాబు అన్నారు. ‘పట్టణాలను కాంక్రీట్‌ జంగిల్స్‌గా కాకుండా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం. 502 పార్కులు, 210 కిలోమీటర్ల సెంట్రల్‌ మీడియన్లు, 391 కిలోమీటర్ల స్ట్రీట్‌ లైటింగ్‌ పనులు చేపట్టబోతున్నాం. రోడ్లతో పాటు సీవరేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాం. వీకెండ్‌ ఎకానమీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో 61 శాతం మొత్తాన్ని వారాంతాల్లో ఖర్చు చేస్తున్నారు. హౌసింగ్‌, రవాణా కోసం పట్టణ ప్రాంతాలవాళ్లు 71 శాతం ఖర్చు చేస్తున్నారు. అందుకే టిడ్కో గృహాలతో పాటు రవాణా కోసం స్త్రీశక్తి లాంటి కార్యక్రమాలు చేపట్టాం. 2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహాలన్నీ పూర్తిచేస్తాం. 2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ పూర్తిచేసి 24గంటలూ సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందిస్తామన్నారు. పట్టణాల అభివృద్ధికి పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టామని.. భవన నిర్మాణ అనుమతులు త్వరితగతిన ఇస్తున్నామని చెప్పారు. విశాఖ కార్పొరేషన్‌ పరిధిలో రూ.3890 కోట్ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

143 లక్షల టన్నుల చెత్త తొలగించాం..

రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో 120 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని సీఎం చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ వంటి పథకాల నిధులను వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారని.. మరికొన్ని కేంద్ర పథకాల నిధులను దారిమళ్లించారని ధ్వజమెత్తారు. ‘గడచిన రెండేళ్లుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 143 లక్షల టన్నుల చెత్త తొలగించాం. ప్రస్తుతం వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు రెండే పనిచేస్తున్నాయి. మరో నాలుగు ప్లాంట్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తాం’ అని తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కుప్పంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనగా.. మంత్రి నారాయణ విశాఖపట్నం నుంచి వర్చువల్‌గా, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.


కృష్ణమ్మకు జలహారతి

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద కృష్ణా జలాలకు సీఎం జలహారతి ఇచ్చారు. పసుపు, కుంకుమలు, పుష్పాలు సమర్పించారు. కెనాల్‌కు ఇరువైపులా నిలిచిన రైతులు, మహిళలు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘హంద్రీనీవా జలం-కుప్పానికి వరం’ అని నినదించారు. బీరుగానిపల్లె వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. పౌల్ర్టీ రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎన్విరాన్‌మెంటల్లీ కంట్రోల్డ్‌ పౌల్ర్టీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం 6గంటలకు తుమ్మిశి నుంచి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకుని.. అమరావతికి పయనమయ్యారు. తొలిరోజు కుప్పంలో ఆయన రూ.38కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, రూ.289 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. 5 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. రాత్రి 11 గంటలకు కుప్పం రైల్వేస్టేషన్‌లో కొత్తగా హాల్ట్‌ ఇచ్చిన దాదర్‌- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జెండా ఊపి స్వాగతం పలికారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 03:43 AM