పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:55 AM
ఎల్‌నినో రఉగ్రరూపం దాలుస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. జలాశయాల్లో నిల్వలు అడుగంటుతున్నాయి. సెప్టెంబరులోనే పరిస్థితి ఇలా ఉంటే..
పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం
ప్రతి కుటుంబానికీ ఇల్లు ఉండాలి
ఇదే లక్ష్యంగా పని చేస్తున్నాం
వైసీపీ పాలనలో అన్నీ కుంభకోణాలే
పేదలకు ఇళ్లు కట్టకుండా రుషికొండపై
రాజభవనం నిర్మించుకున్నారు
కూటమికి ఓటేసి మంచి పని చేశారు
ఆ ఓటే మీకు ఆస్తి హక్కును తెచ్చిపెట్టింది
పరిశ్రమలతో అవకాశాలను ఇస్తాం..
అందిపుచ్చుకొని యువత ఎదగాలి
విశ్వనగరంగా విశాఖను తీర్చిదిద్దుతా..
పేదలకు పట్టాల పంపిణీలో సీఎం వెల్లడి
‘‘విశాఖలో పేదలకు పట్టాలు ఇస్తామని నాడు మోదీ, నేను, పవన్‌కల్యాణ్ చెప్పాం. ఇప్పుడు చేసి చూపించాం. దశాబ్దాల కలను నిజం చేశాం. మీరు నిర్మించుకున్న ఇళ్లపై హక్కు లేదనే ఆవేదన ఇక అవసరం లేదు. సర్వ హక్కులూ కల్పిస్తున్నాం. ఈ భూముల విలువ రిజిస్ట్రేషన్ ధర ప్రకారం రూ.8,874 కోట్లు. మార్కెట్ ధర ఇంకా ఎక్కువ ఉంటుంది. భూములను అమ్ముకోవద్దు. అదే మీకు భరోసా.’’
- సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ జాగా ఉండాలని, అందులో ఇల్లు కట్టుకొని శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు, కన్వేయన్స్ డీడ్లను ఆయన శనివారం పంపిణీ చేశారు. 11 మండలాల పరిధిలో 28,455 కుటుంబాలు సుమారు 19 లక్షల గజాల స్థలంలో ఈ ఇళ్లు నిర్మించుకున్నారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభలో, వాటికి పట్టాలను సీఎం అందించారు. ‘‘ 2024లో ఓటు కూటమికి వేసి మంచి పనిచేశారు. ఆ ఓటు మీకు ఆస్తిహక్కు ఇచ్చింది. తలరాతను మార్చింది. భయం స్థానే భరోసా ఇచ్చింది. విధ్వంసం బదులు వికాసం ఇచ్చింది.
నిరాశను పోగొట్టి ఆశలు కల్పించింది’’ అని తెలిపారు. ఇది పేదలకు పట్టాల పంపిణీయే కాదు...వారి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం అని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలకు కూడు..గూడు..గుడ్డ అనేది టీడీపీ సృష్టికర్త ఎన్‌టీఆర్ ఆశయం. దానినే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నాం.’’ అని పేర్కొన్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని, వివిధ జిల్లాల్లో 12 వేల కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు ఇచ్చామని తెలిపారు. విశాఖలో మరో పది వేల మందిని గుర్తించామని, పంచ గ్రామాల్లో 12,149 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ‘‘అది దేవదాయ శాఖ భూమి. కోర్టులో వివాదం ఉంది. అది కూడా పరిష్కరించి మొత్తం మరో 22 వేల మందికి పట్టాలు ఇస్తాం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే కలెక్టర్‌కు ఆదేశిస్తున్నా. గత ప్రభుత్వం పట్టాదారు పుస్తకాలపై వారి బొమ్మలు వేసి ఇచ్చింది. ఇప్పుడు మేం రాజముద్ర వేసి ఇస్తున్నాం. అదే తేడా.’’ అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే 5.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరో 5.52 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి 91 ప్రాజెక్టుల ద్వారా 5,37,761 కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వాటి ద్వారా మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
భోగాపురం.. గేమ్ చేంజర్
‘‘రాష్ట్రంలో విశాఖపట్నం తలసరి ఆదాయమే ఎక్కువ. దీనిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తాం. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీ, ఐటీ పరిశ్రమలు...ఇలా అనేకం రప్పిస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తెచ్చాం. అది గేమ్ చేంజర్ అవుతుంది.’’
145 లక్షల టన్నుల చెత్త తొలగించాం
‘‘గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడికక్కడ 145 లక్షల టన్నుల చెత్త నిల్వ చేసి వెళ్లిపోయింది. అదంతా తొలగించి, వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నాం. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 50 శాతమే వర్షం కురిసింది. ఇలాంటి సమస్యలను నేను ముందే ఊహించి, పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి విశాఖకు నీరు తెచ్చే విధంగా ప్రణాళిక అమలు చేశాను. ఎన్ని టీఎంసీలు కావాలన్నా విశాఖకు తెస్తాం. ఇక్కడి నుంచి గోదావరిని వంశధారకు అనుసంధానం చేస్తాం.’’
అదో పీడకల
రాష్ట్రంలో 2019-2024 పరిపాలన ఒక పీడ కల. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారు. నాటి పాలనలో అన్నీ కుంభకోణాలే. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు. ఉత్తరాంధ్రాలో భూములు చెరబట్టారు. భూముల రీసర్వే పేరుతో సమస్యలు సృష్టించారు. పేదలకు ఇళ్లు కట్టకుండా వారి కోసం రుషికొండపై రాజభవనం నిర్మించుకున్నారు. దానిని ఏమి చేయాలో ఇప్పుడు అర్థం కావడం లేదు. మోదీ, పవన్ కల్యాణ్, నేను అధికారంలో ఉండగా అవినీతి జరగనివ్వబోం. 2047 నాటికి వికసిత్ భారత్‌లో ఏపీని నంబర్‌వన్‌గా నిలుపుతాం.’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
బీచ్‌లో వ్యర్థాలను ఏరిన సీఎం
పారిశుధ్య కార్మికులు, జాలర్లతో మాటామంతీ
ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న శానిటరీ ఉద్యోగి గోవింద్‌తో మాట్లాడారు. బీచ్‌లో పారిశుధ్య నిర్వహణ ప్రక్రియ ఎలా జరుగుతోంది?, ఎంతమంది సిబ్బంది పనిచేస్తుంటారు?, బీచ్‌లోకి ఎలాంటి వ్యర్థాలు ఎక్కువగా వస్తుంటాయి?...వంటి వివరాలతోపాటు గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు?, ఎలాంటి వ్యర్థాలు సముద్రంలో వస్తుంటాయి?, వాటిని బయటకు తీయడానికి ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. బీచ్‌లో నిమజ్జనాల ప్రక్రియను జీవీఎంసీ కమిషనర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, రాత్రివేళ ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారని వివరించారు. రాత్రి నిమజ్జనాల సమయంలో వచ్చే వ్యర్థాలను తెల్లవారుజామున ఆరు గంటలయ్యేసరికి పూర్తిగా తొలగించేస్తున్నామని, సందర్శకులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిషనర్ తరచూ బీచ్‌కు వచ్చి పర్యవేక్షిస్తున్నారని సీఎంకు వివరించారు.
బీచ్‌లో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులతో కలిసి సీఎం ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సేకరించారు. అనంతరం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. బీచ్‌లో మురీమిక్చర్ కొనుగోలు చేసి రుచిచూశారు. ఆ దుకాణం నిర్వహిస్తున్న అట్టాల నాగమణితో మాట్లాడారు. నాగమణి తన ఆర్థిక పరిస్థితి, కుటుంబ దీనస్థితిని వివరించగా, ఆమెకు ఒంటరి మహిళ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం సమీపంలో ఏర్పాటుచేసిన స్టాల్‌కు వెళ్లిన సీఎం అక్కడి నుంచే పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
ర్యాంపుపై అభివాదం చేస్తూ.. ప్రజలను ఆకర్షించిన సీఎం శైలి
ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శనివారం మధ్యాహ్నం పట్టాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంపుపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అధికారులు ప్రధాన వేదిక నుంచి అభిముఖంగా లబ్ధిదారులు ఉన్న చివరి గ్యాలరీ వరకు ర్యాంపు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదికపైకి వచ్చిన సీఎం తొలుత అక్కడ నుంచే చేయి ఊపుతూ లబ్ధిదారులను ఉత్సాహపరిచారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ర్యాంపుపై నడుచుకుంటూ అభివాదం చేస్తూ..మధ్యలో నమస్కరిస్తూ ముందుకుసాగారు.
ఇన్నాళ్లకు మా కష్టాలు తీరాయి
‘‘మా ఇంటిపై మాకు హక్కు లేదని అంతా చెబుతూ ఉండేవారు. దాంతో ఆందోళనతో బతకాల్సి వచ్చేది. మా అమ్మ దంగేటి లక్ష్మి 35 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో నేను పుట్టి పెరిగాను. భర్తతో కలసి అమ్మ దగ్గరే ఉంటున్నా. తాటాకుల ఇంట్లో ఉంటూ, చెకోడీలు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నా. అలా కూడబెట్టిన డబ్బులతో చిన్న ఇల్లు నిర్మించుకున్నాం. కానీ, దానికి పట్టా లేకపోవడంతో, ఇంటిపై ఎలాంటి హక్కు లేదని కార్పొరేషన్ వాళ్లు చెప్పేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టా ఇవ్వడంతో ఇన్నాళ్లకు మా కష్టాలు తీరాయి.’’
- పేర్ల కుమారి, రవీంద్రనగర్, ఆరిలోవ
కొండంత ధైర్యం వచ్చింది
‘‘గాజువాక లో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నామని ఎంతోమంది భయపట్టేవారు. భర్త మృతి చెందాక, కుటుంబ భారం నాపైనే పడింది. దుస్తులు ఉతుకుతూ వచ్చే ఆదాయంతో పిల్లలిద్దరినీ ఇంజనీరింగ్ చదివించాను. తొలిరోజుల్లో తాటాకుల ఇల్లు ఉండేది. కొన్నాళ్లకు స్లాబ్ వేసుకున్నాం. కానీ, దానిపై మాకు హక్కులేదని ఎవరెవరో వచ్చి బెదిరించేవారు. ఏళ్ల తరబడి ఉంటున్న మా ఇంటికి పట్టా ఇప్పించాలని కనిపించిన నాయకులందరినీ అడిగేదాన్ని. ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, మాకు పట్టా వచ్చింది. కొండంత ధైర్యం వచ్చింది.’’
- తోకాడ రమణమ్మ, గాజువాక
ఊహించలేదు..
‘‘బతుకుతెరువు కోసం చాలాకాలం క్రితం విజయనగరం జిల్లా నుంచి వచ్చాం. ఆరిలోవ లోని పూరింట్లో అద్దెకు ఉండేవాళ్లం. వర్షాకాలంలో ఇళ్లంతా తడిసిపోయేది. కుటుంబమంతా ఇబ్బందులు పడేవాళ్లం. ఒక్కొక్కసారి పాములు వచ్చేవి. ఆ సమయంలో కొండవాలులో పాక వేసుకున్నాం. మాలాగే సుమారు 750 కుటుంబాలు పాకలు వేసుకున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుంటామని ఊహించలేదు.’’
- సామంతుల కొండమ్మ, లబ్ధిదారు
46 ఏళ్లుగా ఉంటున్న ఇంటికి ఎట్టకేలకు పట్టా..
పెదజాలారిపేటలో 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని 1980 నుంచి ఉంటున్నాను. పిల్లలు పెళ్లి అయ్యాక వెళ్లిపోయారు. 46 ఏళ్ల నుంచి ఒంటరిగా అదే ఇంటిలో ఉంటున్నాను. ఆ ఇంటికి ఎలాంటి పత్రాలు లేవు. విద్యుత్ బిల్లు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాను. కొద్దిరోజుల కిందట తెలిసినవారు మాట్లాడుతూ , నువ్వు ఉంటున్న ఇంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నీ పేరున ఇస్తారు. సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. 46 ఏళ్ల నుంచి జరగనిది ఇప్పుడేం జరుగుతుందిలే...అనుకుంటూనే సచివాలయంలో నా దగ్గర ఉన్న పత్రాలు ఇచ్చాను. మొన్న ఎవరో వచ్చి నీ ఇల్లు పేరున పట్టా అయిందని చెప్పడంతో ముందు నమ్మలేకపోయాను. ఆ తర్వాత సంతోషం వేసింది.’’
-తెడ్డు చెల్లాయమ్మ, పెదజాలారిపేట
జీవితాల్లో వెలుగులు నింపారు
‘‘ఆరిలోవలో 30 ఏళ్ల కిందట వేరొకరి వద్ద 55 గజాల స్థలం కొన్నాం. అక్కడే స్లాబు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నాం. అది ప్రభుత్వ స్థలం కావడంతో దానిపై ఎలాం టి హక్కు లేకుండా పోయింది. డబ్బులు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నా అద్దె ఇంటిలో ఉన్నట్టే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. ముఖ్యమంత్రి నాకు న్యాయం చేశారు.’’
- సత్యనారాయణమ్మ, ఆరిలోవ
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు