Share News

నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి..తేడా చూడండి!

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:47 AM

‘రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూశారు.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాన్నీ చూశారు. నాటి విధ్వంసాన్ని చూశారు. నేటి అభివృద్ధిని చూశారు. నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి తేడా చూడండి.

నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి..తేడా చూడండి!

  • ఎవరి చిత్తశుద్ధి ఏమిటో గమనించండి

  • ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ సిక్స్‌ అమలు

  • మిత్రుడు పవన్‌తో కలిసి గ్రామాల అభివృద్ధి

  • రూ.11,085 కోట్లు ఖర్చు చేయబోతున్నాం

  • మీ జీవితాల్లో వెలుగులు నింపే పూచీ మాది

  • ఎన్‌డీఏకు అండగా నిలిచే బాధ్యత మీది

  • బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పిలుపు

  • ఉదయగిరి నియోజకవర్గంలో

  • పవన్‌తో కలిసి పల్లెపండుగ 3.0కి శ్రీకారం

  • గర్వించేలా ఎన్డీయే అభివృద్ధి : మాధవ్‌

నెల్లూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూశారు.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాన్నీ చూశారు. నాటి విధ్వంసాన్ని చూశారు. నేటి అభివృద్ధిని చూశారు. నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి తేడా చూడండి. నాటి విధ్వంసానికి నేటి వికాసానికి వ్యత్యాసం తెలుసుకోండి.. మేం ప్రజలకు పట్టాభిషేకం చేస్తామంటున్నాం. వారు రక్తాభిషేకం అంటున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే.. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మద్య వ్యత్యాసాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో వారు వేసిన ఓటు వృథా కాలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేశామని.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టామని చెప్పారు. ‘రెండేళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. పలు రంగాలకు చెందిన పరిశ్రమలు తెచ్చాం. నా స్నేహితుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..

ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడండి. మీ జీవితాల్లో వెలుగులు నింపే పూచీ మాది. మాకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీది. ఎన్‌డీఏ ప్రభుత్వానికి సహకరించండి.. ఆశీర్వదించండి. 2024లో 94 శాతం స్ట్రయిక్‌ రేటుతో ఎన్‌డీఏకి ప్రజలు భారీ విజయాన్ని ఇచ్చారు. ఇంత భారీ మెజారిటీ ఇప్పటి వరకు ఎవరికీ లేదు. ఇది చరిత్ర. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటికి రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. నేను షాకయ్యాను. నాలుగోసారి సీఎం అయ్యాను. ఎంతో సీనియర్‌ను. అయినా రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు. కానీ వెనక్కి తగ్గలేదు. నా అనుభవం, మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ హుషారు, ప్రధాని మోదీ సహకారంతో డబుల్‌ ఇంజన్‌ స్పీడుతో ముందుకు పోతున్నాం. గతంలో మీ పల్లెలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అవి పల్లెలు కన్నీళ్లు పెట్టిన రోజులు. ఏ రోడ్డు చూసినా గోతులమయం. పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడరు కొనడానికి కూడా డబ్బుల్లేవు. అలాంటి పరిస్థితుల్లో పవన్‌ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఒకే రోజు 13,326 గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. పంచాయతీరాజ్‌ శాఖలో పది వేలకు పైగా పదోన్నతులు కల్పించారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం 13 జాతీయ అవార్డులు దక్కించుకుందంటే డిప్యూటీ సీఎం, అధికారుల కృషే కారణం. పల్లెపండుగ 3.0 కింద రూ.11,085 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. 9500 కిమీ బీటీ రోడ్లు, 6 వేల కిమీ సీసీ రోడ్లు వేస్తున్నాం. కాలికి బురద అంటకుండా సౌకర్యాలు కల్పిస్తాం.


అన్నీ చేసి చూపిస్తున్నాం..

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసి చూపిస్తున్నాం. ఎంత మంది బిడ్డలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తున్నాం. ఆడపడుచులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాం. ప్రతి నెలా 1న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు రూ.4 వేలు, పది వేలు, 15 వేల చొప్పున ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ మొత్తాన్ని పెంచాం. మత్స్యకార, నేతన్న, ఆటో కార్మికులను ఆదుకున్నాం. వెలిగొండ పూర్తి చేశాం. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు గోదావరి నీటిని తరలించాం. మొన్న విశాఖలో 28 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. ఇప్పుడు విజయవాడలో 24 వేలు ఇవ్వబోతున్నాం. పేదల కోసం 4 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం, అక్టోబరు 4న భూమిపూజ చేస్తున్నాం. ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు గుర్తించాలి.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 03:48 AM