విపత్తు నిధుల సద్వినియోగం!
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:17 AM
ఓ వైపు కరువు.. మరో వైపు తుఫాన్లతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రజలను ఆదుకునేందుకు.. విపత్తు నిర్వహణకు కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కేంద్రం నుంచి అదనంగానూ సాధించాలి: సీఎం
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఓ వైపు కరువు.. మరో వైపు తుఫాన్లతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రజలను ఆదుకునేందుకు.. విపత్తు నిర్వహణకు కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీటిని పూర్తిగా వినియోగించుకోవడమే గాకుండా.. కేంద్రం నుంచి అదనపు నిధులు కూడా సాధించాలని సూచించారు. తద్వారా బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం చేయాలన్నారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ఇటీవల సంభవించిన అర్నబ్, మురసు తుఫాన్లతో రైతులకు జరిగిన నష్టం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష జరిపారు.
పంటలు నష్టపోయిన రైతులకు సాధ్యమైన త్వరగా ఇన్పుట్ సబ్సిడీ అందించాలన్నారు. కరువు, రెండు తుఫాన్ల వల్ల నష్టానికి ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.2,459 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వ్యవసాయ రంగానికి కరువు నష్టానికి రూ.1,721కోట్లు, అర్నబ్ తుఫాన్‌కు రూ.602 కోట్లు, మురసు తుఫాన్‌కు రూ.97 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రతి రైతుకూ బీమా సాయం అందేలా చూడాలని సీఎం చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..