కోస్తాకు మరో తీవ్ర తుఫాన్ ముప్పు
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:09 AM
వారం వ్యవధిలో సంభవించిన రెండు తుఫాన్‌లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తా జిల్లాలకు మరో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆ
బంగాళాఖాతంలో వాయుగుండం
రేపటికి తుఫాన్‌గా, ఎల్లుండికి మరింత తీవ్రరూపం
20న కళింగపట్నం, బందరు మధ్య తీరంపైకి
శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు అతి భారీ వర్షాలు.. 145 కి.మీ. వేగంతో గాలులు
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): వారం వ్యవధిలో సంభవించిన రెండు తుఫాన్‌లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తా జిల్లాలకు మరో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది తుఫాన్‌గా బలపడి ఈనెల 20వ తేదీన కళింగపట్నం, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.
అర్నబ్ తుఫాన్ సమయంలో వీచిన గాలుల మాదిరిగానే గంటకు 100 నుంచి 130 కి.మీ., అప్పుడప్పుడు 145 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఉత్తర కోస్తాలోనే తుఫాన్ తీరం దాటుతుందని రిటైర్డు వాతావరణ అధికారి ఒకరు వివరించారు. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంకలోని టింకోమలికి 620, అండమాన్ దీవుల్లోని శ్రీవిజయపురానికి 680, చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 800, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ తుఫాన్‌గా, అనంతరం మంగళవారానికి పశ్చిమ మధ్యబంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుంది. ఆ తర్వాత రెండురోజుల్లో వాయవ్యంగా పయనించి కోస్తాంధ్ర తీరం దిశగా వస్తుందని ఐఎండీ తెలిపింది. దీనికి ఇరాన్ దేశం సూచించిన ‘అక్వాన్’ పేరు పెట్టనున్నారు. తీవ్ర తుఫాన్ తీరం దిశగా వచ్చే క్రమంలో నెమ్మదిగా పయనిస్తుందని, దీంతో రెండు రోజులపాటు కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ కారణంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాలపై తీవ్రప్రభావం పడుతుందని, బాపట్ల జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతుందని పేర్కొన్నారు.
18వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమై 19వ తేదీ నుంచి భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, గాలుల వేగం మరింతగా పెరగనున్నదని హెచ్చరించారు. ఈ క్రమంలో భూ ఉపరితలం నుంచి చలిగాలులు తీవ్ర తుఫాన్ దిశగా వీచే అవకాశం ఉండడంతో సముద్రంలో తుఫాన్/వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వివరించారు. 20వ తేదీ ఉదయం కళింగపట్నం, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం తూర్పుమధ్య బంగాళాఖాతంలో రిడ్జ్ కొనసాగుతుండంతో భూ ఉపరితలం నుంచి 10 కి.మీ. ఎత్తులో ఉన్న వాతావరణ పరిస్థితులతో తుఫాన్ గమనం ఉంటుందని వివరించారు.
కోస్తాకు కుంభవృష్టి ప్రమాదం
తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఈనెల 18వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. 19న కాకినాడ, కోనసీమ, యానాం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టిగా, మిగిలిన శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు అతిభారీ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 20న ఉభయగోదావరి జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు మిగిలిన జిల్లాల్లో అతిభారీ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 16వ తేదీ నుంచి తీరం వెంబడి బలమైనగాలులు వీస్తాయని, 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉభయగోదావరి జిల్లాల్లో గంటకు 120 నుంచి 130 కి.మీ., అప్పుడప్పుడు 145 కి.మీ., మిగిలిన జిల్లాల్లో 90 నుంచి 100 కి.మీ., అప్పుడప్పుడు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.
ఈ సమయంలో తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర అలలు చొచ్చుకువస్తాయి. మత్స్యకారులు ఈ నెల 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా, వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!