ఏపీ ఆయుష్‌కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:52 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య రంగానికి భారీ ఊతం లభించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ఏపీకి ఏకంగా రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అమరావతి, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ఆయుష్ విభాగానికి రూ.185.75 కోట్లతో వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ ఆయుష్ చరిత్రలోనే తొలిసారిగా 2024-25 నుంచి 2026-27 వరకు కలిపి మొత్తం రూ.434 కోట్ల కేటాయింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 2014-15 నుంచి 2023-24 వరకూ పదేళ్లలో ఆయుష్‌కు రూ.120.17 కోట్లు మాత్రమే కేటాయించగా.. తాజాగా మూడేళ్ల కాలానికే భారీగా నిధులు మంజూరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.
తాజా కేటాయింపుల్లో భాగంగా ఐటీడీఏ ప్రాంతాల్లో 19 మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు, ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఆల్కహాల్ డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు, యోగా వెల్నెస్ కేంద్రాల అభివృద్ధితో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగించనున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా ఈ ప్రణాళిక ఉపయోగపడనుంది. ఆయుష్ రంగానికి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో రాష్ట్రంలో వైద్య రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునిక వైద్యంతో పాటు ఆయుష్ సేవలను కూడా బలోపేతం చేస్తూ ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్
ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు