Share News

ఆశల పల్లకి!

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:42 AM

రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2029వరకు పెరిగే అవకాశాల్లేవని తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం ఉత్సాహం ఉరకలేస్తోంది.

ఆశల పల్లకి!

  • పునర్విభజనతో ఏపీ అసెంబ్లీ బలం 263కి!!

  • ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే పెరుగుదల

  • ఇదే జరిగితే కూటమి పార్టీలకు లబ్ధి?

  • ఇక అధికారంలోకి రావాలంటే..అసెంబ్లీలో మ్యాజిక్‌ మార్క్‌ 132

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2029వరకు పెరిగే అవకాశాల్లేవని తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం ఉత్సాహం ఉరకలేస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా అదనంగా యాభై శాతం పెంచేందుకు కేంద్రం నిర్ణయించడమే దీనికి కారణం. పార్లమెంటు ఆమోదంతో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రస్తుతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో కొనసాగుతోంది. నియోజకవర్గ సరిహద్దులను మార్చే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ఓటు బ్యాంకుకు అనుకూలంగా సరిహద్దులను ప్రభావితం చేయగలిగితే ఎన్నికల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2008లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గాల సరిహద్దుల మార్పు జరిగింది. దానిని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంక్‌కు అనుకూలంగా మార్పులు చేసుకుని 2009 ఎన్నికలలో లాభపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీకి పునర్విభజన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ఆసక్తిగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం డిసైడ్‌ చేసే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 35 స్థానాలు 53కు చేరే అవకాశం ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయాలు సాధించింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలు 53కు, కృష్ణా, గుంటూరు జిల్లాలో 51కి చేరే అవకాశం ఉంది. డీలిమిటేషన్‌లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి.


పట్టణ ఓటర్లు కూటమికే అనుకూలంగా ఉన్నారని.. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో ఇది రుజువైందని టీడీపీ నేతలు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు తగ్గి పట్టణ ప్రాంతాల్లో పెరగడం కూటమికే కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కూటమి అత్యంత బలంగా ఉన్న కోస్తా జిల్లాల్లో సీట్లు భారీగా పెరగడం.. అందులోని మూడు పార్టీలకూ ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల సరిహద్దులు కూడా మారుతాయి. కొన్ని జనరల్‌ స్థానాలు రిజర్వ్‌డ్‌ స్థానాలుగా, కొన్ని రిజర్వ్‌డ్‌ స్థానాలు జనరల్‌కు మారే అవకాశముంది. దీంతో సిట్టింగ్‌లు కొత్త నియోజకవర్గాలను ఎంపిక చేసుకోవలసి రావచ్చు. మూడో వంతు మహిళా రిజర్వేషన్ల కారణంగా తమ తమ సీట్లు కోల్పోయే నేతలు,, తమ భార్యలను.. లేదా కుమార్తెలు/కోడళ్లను రాజకీయాల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.

అంకెలన్నీ మారతాయ్‌!

పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 263కి పెరిగితే.. అధికారంలోకి రావడానికి మ్యాజిక్‌ మార్క్‌ 132 అవుతుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 27 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అలాగే మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 26 నుంచి 39కి పెరుగుతుంది. డీలిమిటేషన్‌ ప్రక్రియతో పాటే 33ు మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీనివల్ల మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య భారీగా పెరుగుతుంది.


సీటు మార్చుకునే వెసులుబాటు..!

నియోజకవర్గాల పునర్విభజనతో చాలా మంది నేతలకు వెసులుబాటు రానుంది. సిట్టింగ్‌ స్థానంలో ప్రజల అసంతృప్తిని అధిగమించి వేరే సీటుకు మారేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడం వల్ల.. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలలో టికెట్లు దక్కక సీనియర్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు. సీట్లు 50 శాతం పెరిగితే కొత్త స్థానాల్లో ఆయా పార్టీల నేతలను సర్దుబాటు చేయడానికి, అదే సమయంలో నూతన నాయకత్వానికి అవకాశం కల్పించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. నియోజకవర్గ సరిహద్దులను మార్చే సమయంలో అధికారంలో ఉన్న పార్టీల నేతలు తమ ఓటు బ్యాంకుకు అనుకూలంగా సరిహద్దులను ప్రభావితం చేయగలిగితే ఎన్నికలలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొత్తమ్మీద పునర్విభజన కదలికతో అధికార పార్టీల నేతల్లో నూతనోత్సాహం నెలకొంది.

విభజన సమయంలోనే పెరగాల్సింది..!

రాష్ట్ర విభజన సమయంలోనే అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. 2014లో పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన పై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణతో ఆరోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్‌చేశారు. దీంతో 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు.


దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని.. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయంలోనూ తన వైఖరిని తేల్చిచెప్పింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై నేతలు ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పుడు వారిలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తెరపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంటులో డీలిమిటేషన్‌ బిల్లు వీగిపోవడంతో వారిలో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. అయితే తాజా పరిణామాలు వారిలో మళ్లీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగకుండా.. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాన్ని అదనంగా 50 శాతం సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన పునర్విభజన బిల్లును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 263కి పెరుగుతాయి. అంటే 88 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా 25 నుంచి 38కి.. అంటే 13 స్థానాలు పెరుగుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 12:51 AM