Share News

పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:24 AM

రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. పారిశ్రామిక భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులను ఏర్పాటు చేస్తుంటే ..

పెట్టుబడుల వెల్లువ

  • 88,624 కోట్ల పెట్టుబడులు..54,419 ఉద్యోగాలు

  • 24వ ఎస్‌ఐపీబీ సమావేశంలో 17 ప్రతిపాదనలు

  • పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ తదితర కంపెనీల రాక

  • 19 వేల కోట్లతో కియ విస్తరణ

  • ఉత్తరాంధ్రకు మరో భారీ డేటా సెంటర్‌

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. పారిశ్రామిక భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులను ఏర్పాటు చేస్తుంటే .. గ్లోబల్‌ కేపబిలిటీ కలిగిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశం ఆమోదించిన పెట్టుబడులు, ఉద్యోగావకాశాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్‌ 2024 నుంచి రాష్ట్రానికి రూ.32.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి.

1,017 ప్రాజెక్టుల ద్వారా 22.7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. భాగస్వామ్య సదస్సు-2026లో మరో రూ.9.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో ఇప్పటికే రూ.7.30 లక్షల కోట్ల పెట్టుబడులతో గ్రౌండింగ్‌ అయిన 303 ప్రాజెక్టుల ద్వారా 7.76 లక్షల ఉద్యోగాల కల్పనకు ముందడుగు పడింది. మంగళవారం నాటి 24వ ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.88,624 కోట్లకుపైగా పెట్టుబడులతో 17 ప్రాజెక్టుల ద్వారా 54,419 వేల ఉద్యోగావకాశాల కల్పన ప్రతిపాదనలు ఉన్నాయి.


వీటిలో కియ కంపెనీ విస్తరణ ఒకటి. శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే కార్ల తయారీ యూనిట్‌ను చేపట్టిన కియ సంస్థ మరో రూ.19,000 కోట్లతో విస్తరణకు సిద్ధమైంది. ఈ యూనిట్లో మరో 12000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్తరాంధ్రకు మరో భారీ పెట్టుబడితో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ రాబోతోంది. అనకాపల్లి జిల్లా తూటిపాలలో 200 ఎకరాల్లో రూ.47009 కోట్ల పెట్టుబడితో బలెవాడిహైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ, డేటా సెంటర్లు, రక్షణ రంగం, ఇంధనం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు వచ్చిన ఈ ప్రతిపాదనలు రానున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందనున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 03:30 AM