Share News

23 పట్టణ సంస్థలకు కూటమి అభ్యర్థులు ఖరారు

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:34 AM

రాష్ట్రంలో రెండో విడత మున్సిపల్‌ ఎన్నికల్లో 23 పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్‌పర్సన్లుగా పోటీచేసే అభ్యర్థులను కూటమి పార్టీలు ఖరారుచేశాయి.

23 పట్టణ సంస్థలకు కూటమి అభ్యర్థులు ఖరారు

  • మంగళగిరి-తాడేపల్లి మేయర్‌ అభ్యర్థిగా పేరం ఏడుకొండలు

  • శ్రీకాకుళంలో రాధారాణి

  • కాకినాడలో ఆకుల భవాని

  • రాజమండ్రికి రేలంగి శ్రీదేవి

  • 15 చోట్ల టీడీపీ, 5 జనసేన, 3 స్థానాల్లో బీజేపీ పోటీ

  • విధేయత, విద్యావంతులకు పెద్దపీట

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత మున్సిపల్‌ ఎన్నికల్లో 23 పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్‌పర్సన్లుగా పోటీచేసే అభ్యర్థులను కూటమి పార్టీలు ఖరారుచేశాయి. వీటిలో టీడీపీ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో, మరో 14 మున్సిపాలిటీల్లో పోటీచేస్తోంది. జనసేన శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లలో, 3 మున్సిపాలిటీల్లో, బీజేపీ రాజమండ్రి కార్పొరేషన్‌లో, రెండు మున్సిపాలిటీల్లో బరిలోకి దిగుతున్నాయి. విధేయతకు అవకాశమిస్తూనే.. విద్యావంతులకు పెద్దపీట వేయడం గమనార్హం.


  • మహిళలు, బీసీలకు టీడీపీ ప్రాధాన్యం

తాజా పట్టణ సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని టికెట్లు ఇచ్చింది. మేయర్‌, చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా మహిళలు, బీసీలకు పెద్దపీట వేసింది. రెండో దశలో పోటీ చేస్తున్న 15 పట్టణ సంస్థలకు గాను ఆరు చోట్ల మహిళలు బరిలో నిలిచారు. అలాగే సామాజికవర్గాల వారీగా ఆరుగురు బీసీలు, నలుగురు ఓసీలు, ఇద్దరు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలకు అవకాశం దక్కింది. సామాజిక సమీకరణలతో పాటు విద్యార్హతలు, వయసుకు కూడా ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 15 మందిలో పది మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. మరో ముగ్గురు ఇంటర్‌, పదోతరగతి లేదా డిప్లొమో చదివారు. ఇద్దరు పదోతరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారు . సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలకు అత్యధికంగా ఆరు స్థానాలు దక్కాయి. మొత్తం అభ్యర్థుల్లో వీరి వాటా 40 శాతం. ఓసీలకు నాలుగు (27 శాతం), ఎస్సీలకు రెండు (13 శాతం), ఎస్టీలకు మూడు (20 శాతం) స్థానాలు లభించాయి. విద్యార్హతల విషయంలోనూ ఆసక్తికరమైన గణాంకాలున్నాయి. పది మంది డిగ్రీ లేదా ఆపై విద్య చదివారు. ముగ్గురు ఇంటర్‌, పదోతరగతి లేదా డిప్లొమా స్థాయిలో ఉన్నారు. మరో ఇద్దరు పదోతరగతి కంటే తక్కువ చదివారు.


  • రాజమండ్రి మేయర్‌ అభ్యర్థిపై అసంతృప్తి?

రాజమహేంద్రవరం బీజేపీ మేయర్‌ అభ్యర్థిపై స్థానిక టీడీపీ, జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బలహీన అభ్యర్థిగా భావిస్తున్నట్లు తెలిసింది. మిత్రపక్షాలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అనంతపురంలో మాదిరిగా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుందనే గుబులు బీజేపీ నేతల్లో మొదలైంది.

  • టీడీపీ మేయర్‌/చైర్‌పర్సన్‌ అభ్యర్థులు వీరే..

మంగళగిరి-తాడేపల్లి-పేరం ఏడుకొండలు (ఎస్టీ-ఎరుకల), ఆమదాలవలస-కూన ప్రమీల (బీసీ-కళింగ), తణుకు-బసవ వీవీఎస్‌ రామకృష్ణ (ఓసీ-కాపు), పాలకొల్లు-ఆబోతుల ఉషారాణి (బీసీ-తూర్పుకాపు), చింతలపూడి-కంభం ఎస్తేరురాణి (ఎస్సీ-మాల), గుడివాడ-మారీడు కరుణ (బీసీ-గౌడ), తాడిగడప-పీట గోపీచంద్‌ (బీసీ-అగ్నికుల క్షత్రియ), పొన్నూరు-కండ్రు విజయలక్ష్మి (ఓసీ-కమ్మ), నరసరావుపేట-నాగసరపు రూపేశ్‌ గుప్తా (ఓసీ-వైశ్య), పొదిలి-వరికుంట్ల అనిల్‌కుమార్‌ (ఎస్సీ-మాదిగ), కందుకూరు-పిడికిడి వెంకటేశ్వర్లు (ఓసీ-కమ్మ), అల్లూరు-తోటకూర సునీల్‌కుమార్‌ (ఎస్టీ-యానాది), గూడూరు-చౌటూరి శిరీష (ఎస్టీ- యానాది), శ్రీకాళహస్తి-పేట బాలాజీ (బీసీ-వన్నెరెడ్డి), బి.కొత్తకోట-కుడుము శ్రీనివాసులు (బీసీ-ఈడిగ).

జనసేన అభ్యర్థులు..

శ్రీకాకుళం-దానేటి రాధారాణి(బీసీ-కళింగ), కాకినాడ-ఆకుల భవాని (బీసీ-మత్స్యకార), రాజాం-బనిశెట్టి సౌజన్యలత(బీసీ-పట్టుసాలి), భీమవరం-చుండూరి మల్లేశ్వరి(ఓసీ-కాపు), తాడేపల్లిగూడెం-పాలూరి వెంకటేశ్వరరావు (ఓసీ-కాపు).

బీజేపీ అభ్యర్థులు..

రాజమహేంద్రవరం-రేలంగి శ్రీదేవి (ఎస్సీ-మాల), బాపట్ల-ఇస్కా సునీల్‌ కుమార్‌ (ఎస్సీ-మాల), కావలి-గుండ్లపల్లి భరత్‌కుమార్‌ (బీసీ-యాదవ).

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 12:43 AM