ఏపీ బ్రాండింగ్ @ దావోస్!
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:29 AM
పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలో మూడో రోజు బుధవారం ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ
మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం
‘ఈజ్ ఆఫ్’ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
పెట్టుబడులతో వచ్చినవారికి తక్షణమే అనుమతులు
విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు
మంత్రి లోకేశ్ చొరవతో సాధించగలిగాం
సంస్కరణలతోనే యువతకు ఉపాధి: సీఎం
అంతర్జాతీయ మీడియాతో బాబు మాటామంతీ
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలో మూడో రోజు బుధవారం ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ పాలసీల గురించి వివరించారు. గతంలో ఉమ్మడి ఏపీని, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ను బ్రాండింగ్ చేసేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సును తాను వేదికగా ఉపయోగించుకుంటున్నానని అన్నారు. ‘‘రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించవచ్చు. సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ , మలేషియా మాజీ అధ్యక్షుడు మహాతీర్ మహ్మద్ నాకు స్ఫూర్తి. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖకు గూగుల్ కంపెనీ రాక రాష్ట్రాభివృద్ధిలో గొప్ప ముందడుగు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలోఅప్ వల్లే ఈ పెట్టుబడులు సాధించగలిగాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడులపై లోకేశ్ సంప్రదింపులు ప్రారంభించారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. టెక్నాలజీ, టెలికాం, విద్యుత్తు, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగాల్లో చేపట్టిన సంస్కరణలతో దేశ దశా దిశా మారిపోయింది. 30 ఏళ్ల కిందట దేశ అభివృద్ధిలో కీలక అడుగులు పడ్డాయి. నేడు ప్రతి రంగంలోనూ దేశం అద్భుత పురోగతి సాధిస్తోంది. అప్పుడూ ఇప్పుడూ సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం. ఈ సంస్కరణలే రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి’’ అని చంద్రబాబు అన్నారు.
భవిష్యత్తు నగరంగా అమరావతి
‘‘రాజధాని నిర్మాణం ఒక అవకాశంగా భావిస్తున్నా. ఒక అద్భుతమైన ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతోంది. అమరావతి భవిష్యత్తు నగరంగా ఉంటుంది. టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నాం. టూరిజం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయి. చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారత దేశానికి ఒక గొప్ప అవకాశంగా అందుతోంది. దీనిని ఒక వరంగా మలచుకుంటున్నాం. సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ భారత దేశానికి ఇప్పుడు బలమైన ఆస్తి. ఒకప్పుడు భారత దేశంలో ఎలకా్ట్రనిక్స్ వస్తువులు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగాం. గతంలో డబుల్ గ్రోత్ అంటే నమ్మలేదు.. ఇప్పుడు నిజమైంది’’ అని చంద్రబాబు అన్నారు.