ఓటు ఒకచోట.. పోటీ మరోచోట!
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:57 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వారి ఓటు హక్కు ఒక ప్రాంతంలో ఉండడం.. పోటీ చేసే స్థానం వేరేది కావడంతో నామినేషన్లు బుట్టదాఖలయ్యాయి.
జడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణ
వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులకు షాక్
జాబితాలో.. బొత్స సోదరుడి వారసుడు
మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మనవడు
జనసేన నాయకురాలు గంటా స్వరూపాదేవి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వారి ఓటు హక్కు ఒక ప్రాంతంలో ఉండడం.. పోటీ చేసే స్థానం వేరేది కావడంతో నామినేషన్లు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఆయా అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. ఈ జాబితాలో వైసీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్య సహా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మనవడు రుద్రఫణి, జనసేన నాయకురాలు, ఏపీటీడీసీ డైరెక్టర్ గంటా స్వరూపాదేవి, మరో జనసేన నాయకురాలు నక్కా జ్యోతి ఉన్నారు. కూటమిలో సీట్ల పంపకాలు ఖరారు కాకముందే కొందరు నామినేషన్లు వేయడం గమనార్హం.
ఓటు హక్కు ఒక చోట ఉండడం, మరో ప్రాంతంలో పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో బొత్స సత్యనారాయణ సోదరుడి(బొత్స లక్ష్మణరావు) కుమారుడు బొత్స చైతన్య నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. చైతన్య.. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే, చైతన్యకు విజయనగరంలో ఓటు హక్కు ఉందని, ఆయన గ్రామీణ ప్రాంతంలో జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేశారని అదే స్థానానికి జనసేన నుంచి పోటీచేస్తున్న కోట్ల రేవతి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. చైతన్యకు సంబంధించి అన్ని పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. ఆయన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మనవడు కేఈ రుద్రఫణి దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు రుద్రఫణి.. కర్నూలులోని కృష్ణగిరి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన ఓటు కర్నూలు జిల్లా పరిషత్తు ఓటర్ల జాబితాలో లేదని, కర్నూలు అర్బన్‌లో ఉందని వైసీపీ అభ్యర్థి మాధవరావు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఆర్‌వో.. రుద్రఫణి నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే కర్నూలు అర్బన్ పరిధిలో ఉన్న తన ఓటును తొలగించాలని కోరుతూ బీఎల్‌వోకు రుద్రఫణి ఫారం-8 అందజేసినట్లు టీడీపీ లీగల్ సెల్ నేతలు తెలిపారు.
అదేక్రమంలో తన స్వగ్రామం కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఇంటి నంబరు.2-30లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఫారం-7 కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఎన్నికల అధికారులు కర్నూలు అర్బన్‌లో ఓటు తొలగించి.. కృష్ణగిరి మండలం కంబాలపాడులో ఓటు హక్కు కల్పించారు. ఓటరు ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అయితే, కొత్తగా చేర్చిన ఓటును జిల్లా పరిషత్తు ఓటర్ల జాబితాలో చేరుస్తూ.. అడిషినల్ జాబితా జత చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆర్‌వో తీసుకున్న నిర్ణయంపై కలెక్టర్ సిరికి అప్పీల్ చేశామని తెలిపారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామన్నారు.
పోటీకి సిద్ధమైన రెండు మండలాల్లోనూ ఓటు హక్కులేకపోవడంతో జనసేన నాయకురాలు, ఏపీటీడీసీ డైరెక్టర్ గంటా స్వరూపాదేవి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కొవ్వూరు మండలాల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా ఆమె నామినేషన్లు వేశారు. శనివారం జరిగిన పరిశీలనలో.. ఆమె ఓటు ఈ రెండు మండలాల పరిధిలోనూ లేదని అధికారులు గుర్తించారు. దీంతో నామినేషన్లు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రాజానగరం పరిధిలోని సంపత్‌నగర్‌లో ప్రస్తుతం ఓటు ఉండడంతో ఆమె నామినేషన్ వేశారు. అయితే కటాఫ్ తేదీ అయిన అక్టోబరు 16వ తేదీలోపు ఉన్న ఓటరు లిస్టులో ఆమె పేరు లేదు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ ఉందని, సరైన పత్రాలు ఇవ్వాలని అధికారులు చెప్పినా స్వరూపాదేవి బేఖాతరు చేశారని తెలిసింది.
విశాఖ జిల్లాలోని భీమిలి జడ్పీటీసీ స్థానానికి జనసేన నాయకురాలు నక్కా జ్యోతి దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఈ ఏడాది జనవరి 1నాటి ఓటర్ల జాబితాను అర్హతగా తీసుకున్నారు. అయితే నక్కా జ్యోతి ఈ నెల 10న తన ఓటును మధురవాడ నుంచి భీమిలి మండలం తాటితూరు పంచాయతీకి మార్చుకున్నారు. కానీ, తాటితూరు పంచాయతీ ఓటర్ల జాబితాలో ఆమె ఓటు నమోదుకాలేదు. దీంతో జ్యోతి నామినేషన్‌ను తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి పి. నారాయణమూర్తి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: