Share News

‘మున్సిపల్‌’ తుది బరిలో 3141 మంది

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:26 AM

రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తుది పోరుకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా..

‘మున్సిపల్‌’ తుది బరిలో 3141 మంది

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తుది పోరుకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. 3141 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 2971 మంది వార్డుల అభ్యర్థులు కాగా, 170 మంది మేయర్‌, చైర్‌పర్సన్‌ అభ్యర్థులున్నారు.

4 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీ/నగర పంచాయతీల పరిధిలో 2658 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం రెండు డివిజన్లు, 39 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 969 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులున్నింటికీ పోటీ అనివార్యమైంది. ఏకగ్రీవం అయిన డివిజన్లు, వార్డులను కూటమి పార్టీలు గెలుచుకోవడం గమనార్హం.


41 చోట్ల ఏకగ్రీవాలు

4 కార్పొరేషన్ల పరిధిలోని 260 డివిజన్లకు 728 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లోని 9, 13వ డివిజన్లు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 258 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 912 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 19 మున్సిపాలిటీ, నగర పంచాయతీల పరిధిలోని 750 వార్డులకు 1816 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.

39 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 711 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో 2059 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవాల విషయంలో గూడూరు మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 48 వార్డులకు 17 ఏకగ్రీవమయ్యాయి. భీమవరంలో 4, తాడేపల్లిగూడెం, పొన్నూరు, శ్రీకాళహస్తిలో మూడు చొప్పున, తణుకు, నరసారావుపేటలో 2 వార్డులు చొప్పున ఏకగ్రీవమయ్యాయి.

అన్ని మేయర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలకు పోటీ

4 కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకు 33 మంది నామినేషన్ల ఉపసంహరించుకున్న తర్వాత తుది బరిలో 36 మంది నిలిచారు. 19 మున్సిపాలిటీ, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ స్థానాలకు 81 మంది ఉపసంహరించుకోగా.. 134 మంది పోటీలో ఉన్నారు. ఏ ఒక్క మేయర్‌, చైర్‌పర్సన్‌ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. తుది అభ్యర్థుల జాబితా వెల్లడి కావడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగనుంది.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 01:30 AM