అడ్మిషను తిరస్కరిస్తే జరిమానా!
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:29 AM
కన్వీనర్ కోటా అడ్మిషన్లు తిరస్కరించే విద్యాసంస్థల యాజమాన్యాలపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహేతుకమైన కారణాలు లేకుండా అడ్మిషన్లు తిరస్కరించే విద్యాసంస్థలపై దశల వారీగా చర్యలు చేపట్టనుంది.
పదేపదే చేస్తే రూ.10 లక్షల వరకు విధింపు
కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్లు ఇవ్వని విద్యాసంస్థలపై దశలవారీగా చర్యలు
ఉన్నత విద్య కమిటీ నిబంధనల్లో ‘ఫైన్ల విధింపు’ చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం
లాసెట్ అడ్మిషన్లపై ఫిర్యాదులు..
కారణాలు లేకుండానే విద్యార్థులకు సీట్లు ఇవ్వని పలు కాలేజీలు..
ఇంజనీరింగ్ అడ్మిషన్లలోనూ ఇదే పరిస్థితి
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కన్వీనర్ కోటా అడ్మిషన్లు తిరస్కరించే విద్యాసంస్థల యాజమాన్యాలపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహేతుకమైన కారణాలు లేకుండా అడ్మిషన్లు తిరస్కరించే విద్యాసంస్థలపై దశల వారీగా చర్యలు చేపట్టనుంది. పదే పదే అడ్మిషన్లు తిరస్కరించే కాలేజీలపై గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించాలని భావిస్తోంది. ఈ అధికారాలను ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీకి అప్పగించనుంది. ఇప్పటివరకూ ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌గా ఉండగా ప్రభుత్వం దానిని కమిటీగా మార్చింది. ఈ కమిటీ నిబంధనలు, అధికారాల రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. ఆ నిబంధనల్లో అడ్మిషన్ల తిరస్కరణకు జరిమానాల విధింపు కూడా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి, రెండోసారి అడ్మిషన్లు తిరస్కరిస్తే కొంత వరకు జరిమానా విధించి.. పదేపదే జరిగితే గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా వేసేలా నిబంధనలు రూపొందించనున్నారు.
ఆ సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ
కన్వీనర్ కోటా అడ్మిషన్ల విషయంలో ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ వివిధ కోర్సులకు కౌన్సెలింగ్ చేపట్టి, సీట్లు కేటాయిస్తుంటే.. కొన్ని కాలేజీలు సొంత కారణాలతో వాటిని తిరస్కరిస్తున్నాయి. ఇలాగే ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్లలో పలుచోట్ల విద్యార్థులకు సీట్లు ఇవ్వలేదు. ఇటీవల కౌన్సెలింగ్ పూర్తయిన లాసెట్‌లో ఫిర్యాదులు ఇంకా పెరిగాయి. పలు న్యాయ కాలేజీలు ఎలాంటి కారణాలు లేకుండానే విద్యార్థులకు సీట్లు ఇవ్వలేదు. దీనిపై ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇకపై అడ్మిషన్లు తిరస్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉన్నత విద్య కమిటీలో ఒక పరిష్కార వేదికను ఏర్పాటు చేయనున్నారు. కాగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు కన్వీనర్ కోటా సీట్లు తిరస్కరించి, వాటిని మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేసుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ధ్రువీకరణ పత్రాల పేరుతో ఇబ్బందులు
కొన్ని కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అడుగుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటేనే ఆదాయ ధ్రువీకరణ అయినప్పటికీ.. ప్రత్యేకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలని పట్టుబడుతుండడం గమన్హాం. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో రేషన్ కార్డులు స్వీకరించే విధానం ఉన్నప్పటికీ, కాలేజీలు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలు కొత్తవి కావాలని కొన్ని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. కులం అనేది ఎప్పటికీ మారదని తెలిసినా.. తాజాగా జారీ చేసిన పత్రాలు కావాలని అడగటం చూస్తుంటే కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉండటంతో.. దీనిపై విద్యాశాఖ పర్యవేక్షణ లేకుండా పోయింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?