Share News

రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:09 AM

కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం కింద రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు

  • 4,757 ఎకరాలు కేటాయింపునకు ప్రభుత్వం అనుమతి

  • శ్రీకాకుళంలో అల్యూమినియం, తూర్పులో కోకో ప్రాసెసింగ్‌,

  • శ్రీసత్యసాయిలో రోబోటిక్స్‌, తిరుపతిలో సెమీకండక్టర్‌ పార్కులు

  • కేంద్ర ప్రభుత్వ ‘భవ్య’ పథకం కింద ఏర్పాటు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం కింద రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఈ పార్కులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ), నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌)తో ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అదనపు ఒప్పందాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా నౌపడ ఉప్పుభూముల్లోని 482.28 ఎకరాల్లో అల్యూమినియం డౌన్‌స్ట్రీమ్‌ పార్క్‌, అనకాపల్లి జిల్లా పైడిపాలలో 399.82 ఎకరాల్లో రేర్‌ ఎర్త్‌ మినరల్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో 202 ఎకరాల్లో కోకో ప్రాసెసింగ్‌ పార్క్‌, నెల్లూరు జిల్లా అనమడుగులో 906.64 ఎకరాల్లో పెట్రో కెమికల్‌ పార్క్‌, కర్నూలు జిల్లా లొడ్డిపల్లిలో 490 ఎకరాల్లో స్టీల్‌ డౌన్‌స్ట్రీమ్‌ అండ్‌ సోలార్‌ సెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్క్‌, కడప జిల్లా జమ్మలమడుగులో 1,000 ఎకరాల్లో డౌన్‌స్ట్రీమ్‌ స్టీల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌, శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో 303 ఎకరాల్లో రోబోటిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ పార్క్‌, ఇదే జిల్లాలోని సోమనాథపల్లిలో 985.64 ఎకరాల్లో ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ సెక్టార్‌ పార్క్‌, తిరుపతి జిల్లా రెడ్డిపల్లిలో 495 ఎకరాల్లో సెమీ కండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌, అన్నమయ్య జిల్లా, తాటిగుంటపల్లిలో 480 ఎకరాల్లో ఎంప్లాయిమెంట్‌ ఇంటెన్సివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌, చిత్తూరు జిల్లా కోసలనగరంలో 500 ఎకరాల్లో ఆటోమొబైల్‌ కాంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్కులను అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.


వీటికి సంబంధించి మొత్తం 4,757.10 ఎకరాల ప్రతిపాదిత విస్తీర్ణంలో 4,190.33 ఎకరాలున్న డీకేటీ, ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఇవే కాకుండా ఇంకా శ్రీ సత్యసాయి జిల్లాలోని తిమ్మసముద్రం, కాకినాడ జిల్లాలోని గోల్‌ ఉప్పు భూముల్లో అదనంగా ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పార్కులలో పరిశ్రమలను త్వరగా ఏర్పాటు చేసేందుకు లే-అవుట్ల ఆమోదం, బిల్డింగ్‌ ప్లాన్‌ల అనుమతులు సింగిల్‌ విండో ద్వారా మంజూరు కానున్నాయి. ఈ మేరకు ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐలా), ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లకు అధికారాలు కల్పించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రతిపాదిత ‘భవ్య’ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుందని పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:09 AM