Share News

2 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - May 07 , 2026 | 04:21 AM

రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి...

2 లక్షల కోట్ల పెట్టుబడులు

  • 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

  • పలు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌

  • విశాఖలో లక్ష కోట్లతో రిలయన్స్‌ డేటా సెంటర్‌

  • 51 వేల కోట్లతో సత్యసాయి జిల్లాలో సోలార్‌ పవర్‌

  • కడపలో 12 వేల కోట్లతో అదానీ ఇంధన ప్రాజెక్టు

  • తిరుపతిలో 2,500 కోట్లతో ఎన్‌ఫీల్డ్‌ యూనిట్‌

  • అనుమతుల వేగంలో ఏపీ బ్రాండ్‌ కనబడాలి

  • ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాలి

  • అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో పలు కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. 15 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమెరికా వెలుపల గూగుల్‌ ఇంత భారీ పెట్టుబడి పెట్టడాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే.. గూగుల్‌ను మించి విశాఖలో రిలయన్స్‌ సంస్థ రూ. 1,08,010 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 51,000 కోట్లతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను కూడా రిలయన్స్‌ స్థాపిస్తుంది. ఈ పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే కడపలో రూ. 12,287 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు, తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటారు సైకిల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు పలు పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి రూ. 2,01,023 కోట్ల పెట్టుబడులు వస్తాయి. వీటితో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.


ప్రతి ఒప్పందమూ గ్రౌండ్‌ కావాలి: సీఎం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిందేనని, ప్రతి ఒప్పందమూ గ్రౌండ్‌ కావాల్సిందేనని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒక పారిశ్రామిక ప్రతిపాదన రాష్ట్రానికి వచ్చాక అనుమతుల నుంచి పరిశ్రమ స్థాపన దాకా నిర్దిష్ట కాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం జరిగేందుకు వీల్లేదన్నారు. అనుమతుల మంజూరులో ‘ఏపీ బ్రాండ్‌’ స్పష్టంగా కనిపించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే మన రాష్ట్రం విభిన్నంగానూ, వేగంగానూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పెట్టుబడులను ఆమోదించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ఎంత భిన్నంగా వ్యవహరిస్తుందో ప్రాక్టికల్‌గా నిరూపించాలంటూ కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావాలన్న తపన ఉన్న అధికారులను నియమించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ఎంఎస్ఎంఈలు కీలకం

‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ అంశాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే స్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) ప్రాజెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహం అందిస్తే, ప్రతి ఇంట్లోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సాహించే వీలుంటుందని వివరించారు. పారిశ్రామిక ప్రాంతాలన్నింటికీ గ్యాస్‌ పైప్‌లైన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆహార తయారీ పరిశ్రమ రంగానికి రాష్ట్రంలో ఎక్కువగా అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి, వాటిని గ్రౌండ్‌ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పాం, కొబ్బరి, కోకో, మామిడి సహా పలు పంటలకు వాల్యూఎడిషన్‌ చేసేలా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా వారికి మేలు కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్‌, అచ్చెన్నాయుడు, సుభాశ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌గా మంత్రి పయ్యావుల కేశవ్‌ హాజరయ్యారు.


ఇంధన రంగంలో వచ్చిన ప్రతిపాదనలు..

  • శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 51 వేల కోట్లతో రిలయన్స్‌ సంస్థ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు. 20000 మందికి ఉద్యోగాలు.

  • క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ త్రీ లిమిటెడ్‌ నంద్యాలలో రూ. 155 కోట్ల పెట్టుబడితో 40 మందికి ఉద్యోగాలు.

  • క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ ట్వల్వ్‌ లిమిటెడ్‌ అనంతపురం జిల్లాలో రూ. 779 కోట్ల పెట్టుబడులు. 125 మందికి ఉద్యోగాలు.

  • క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ థర్టీన్‌ లిమిటెడ్‌ అనంతపురం జిల్లాలో రూ. 779 కోట్ల పెట్టుబడులు. 125 మందికి ఉద్యోగాలు.

  • అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవన్‌ కడప జిల్లాలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు రూ. 12,287 కోట్ల పెట్టుబడి. 3,375 మందికి ఉద్యోగాలు.

  • యమాన్కో ఇండియా ప్రై.లి. తిరుపతి జిల్లాలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌కు రూ. 9,398 కోట్ల పెట్టుబడి. 5,820 మందికి ఉద్యోగాలు.

  • అమృతశ్రీ బయో సీఎన్జీ సంస్థ విజయనగరంలో రూ. 89 కోట్ల పెట్టుబడి. 402 మందికి ఉద్యోగాలు

ఐటీ రంగంలో వచ్చిన ప్రతిపాదనలు..

  • రిలయన్స్‌ సంస్థ విశాఖలో 1,08,010 కోట్లతో డేటా సెంటర్‌. 1,000 మందికి ఉద్యోగాలు.

  • క్యారియర్‌ ఎయిర్‌ కండిషన్స్‌ తిరుపతి జిల్లాలో బల్క్‌ చిల్లర్స్‌ తయారీ యూనిట్‌కు రూ. 863 కోట్ల పెట్టుబడి. 721 మందికి ఉద్యోగాలు.

Updated Date - May 07 , 2026 | 04:21 AM