గిరిజన శక్తి.. ఆదివాసీల కోసం ప్రత్యేక కార్యక్రమం
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:17 AM
స్వపరిపాలనను బలోపేతం చేయడం, గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు, సం స్కృతి, సహజ వనరులను పరిరక్షించి, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభలకు అధికారాలు
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు
ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి
అమరావతి, (ఆంధ్రజ్యోతి): స్వపరిపాలనను బలోపేతం చేయడం, గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు, సం స్కృతి, సహజ వనరులను పరిరక్షించి, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్ట్రెంతనింగ్ హేబిటేట్ అండ్ ఆదివాసీ నాలెడ్జి సిస్టం త్రూ ట్రెడిషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (శక్తి) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పీసా చట్టం-1996, ఏపీ పంచాయతీరాజ్ (సవరణ)చట్టం-1998, ఏపీ పీసీ నిబంధనలు-2011 ప్రకారం గ్రామసభల సామర్థ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామసభలే కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు
గ్రామసభలు తమ అవసరాలకు అనుగుణంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. అవగాహన హక్కుల కమిటీ, వనరుల ప్రణాళిక సమీకరణ కమిటీ, పండుగలు సాంస్కృతిక క్రీడల కమిటీ, సంక్షేమం విద్య కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమిటీలో 10-15 మంది సభ్యులు ఉండాలి. కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూసుకోవాలి. పీవీటీజీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కమిటీ చైర్‌పర్సన్, కార్యదర్శిని గ్రామసభ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ పదవీకాలం కనీసం రెండేళ్లు. గ్రామసభ దాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. అవసరమైతే ఏ సభ్యుడినైనా మార్చే, కమిటీని పునర్యవస్థీకరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. కమిటీలు నెలకు ఒకసారి సమావేశం కావాలి. మొత్తం సభ్యుల్లో సగం మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. సమావేశాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
హక్కులపై అవగాహన...
హక్కుల కమిటీ పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, భూబదలాయింపు నిబంధనలు, గిరిజన సంక్షేమ చట్టాలపై గ్రామసభ ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామసభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. మినిట్స్‌ను డిజిటలైజ్ చేయాలి. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు గ్రామసభకు హాజరవ్వాలి.
వనరుల ప్రణాళిక, సమీకరణ కమిటీ
గ్రామంలోని సహజ, మానవ, ఆర్థిక వనరుల వివరాలను సేకరించి జియోట్యాగింగ్ చేయాలి. గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ప్రభుత్వ పథకాల సమన్వయం, సామాజిక భాగస్వామ్యం, స్వచ్ఛంద శ్రమ, జీవనోపాధి అవకాశాల గుర్తింపు వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
గిరిజన సంస్కృతి రక్షణ..
పండుగలు, సాంస్కృతిక, క్రీడల కమిటీ.. గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, మౌఖిక చరిత్ర, సంగీతం, నృత్యాలు, జానపద కళలు, క్రీడలను నమోదు చేసి భవిష్యత్తుతరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ పండగలను పునరుద్ధరించడం, కళాకారులకు ప్రోత్సహించడం, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలు, సాంస్కృతిక మేళాలు నిర్వహించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. గిరిజనుల సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడంతోపాటు దుర్వినియోగం, అనధికార వినియోగం జరక్కుండా చర్యలు తీసుకోవాలి.
విద్య, సంక్షేమంపై పర్యవేక్షణ...
సంక్షేమం, విద్యా కమిటీ.. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరును పర్యవేక్షించాలి. గిరిజన పిల్లల పాఠశాల ప్రవేశం, హాజరు, చదువు కొనసాగింపు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పోషకాహారం, రక్తహీనత నివారణ, టీకాలు, తల్లి-శిశు ఆరోగ్యం, స్కాలర్‌షి్‌పలు, వసతి గృహాలు, గృహాలు, పింఛన్లు, జీవనోపాధి పథకాల అమలుపై పర్యవేక్షణ చేయాలి.
ఇవి కూడా చదవండి
వైసీపీ పట్ల భవిష్యత్‌లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్