Share News

ఎబోలా కలకలం..!

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:32 AM

ఆఫ్రికాలో కలకలం రేపుతున్న ఎబోలా వైర్‌సపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, ఎబోలా అనుమానిత కేసుల నిర్వహణకు ఏపీలోని ఐదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలు సిద్ధం చేశామని ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ తెలిపారు.

ఎబోలా కలకలం..!

  • ఐదు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు

  • వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ముందస్తు చర్యలు

  • విమానాశ్రయాలు, ఓడ రేవుల వద్ద ప్రత్యేక స్ర్కీనింగ్‌

  • కేంద్రానికి తెలిపిన ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌

అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆఫ్రికాలో కలకలం రేపుతున్న ఎబోలా వైర్‌సపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, ఎబోలా అనుమానిత కేసుల నిర్వహణకు ఏపీలోని ఐదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలు సిద్ధం చేశామని ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ తెలిపారు. వీటిలో మొత్తం 46 పడకలు, 3,288 పీపీఈ కిట్లు, 104 నమూనా సేకరణ కిట్లు, ఐదు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎబోలా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తిరుపతి, భోగాపురం, విజయవాడ విమానాశ్రయాల్లో ఎబోలా అనుమానిత లక్షణాలున్న వారికి స్ర్కీనింగ్‌ చేసేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఓడ రేవుల్లోనూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించామని చెప్పారు.

సన్నద్ధతపై ఈ నెల 12న మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహిస్తామన్నారు. సమీక్షలో భాగంగా ఎబోలా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ జారీచేసిన మార్గదర్శకాల అమలు తీరును నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అదనపు సంచాలకులు హిమాన్షు చౌతా, జాయింట్‌ డైరెక్టర్‌ శుభా గార్గ్‌ (మైక్రో), ఇతర అధికారులు వివరించారు. ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల వివరాలను వెల్లడించారు. ఆఫ్రికాలోని కాంగో దేశంలో 10,467 కేసులు... 5103 మరణాలు, కెన్యాలో 9 కేసులు.. 2 మరణాలు, ఉగాండాలో 20 కేసులు.. 2 మరణాలు, నైజీరియాలో ఒక కేసు నమోదయ్యాయని తెలిపారు. ఫ్రాన్స్‌లోనూ ఒక కేసు నమోదైందన్నారు.


ప్రస్తుత వ్యాప్తికి బుండిబుగ్యో వైరస్‌ రకం కారణమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికా వ్యాధి నియంత్రణ సంస్థ సూచించిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య, గత 21 రోజుల ప్రయాణ చరిత్రను తనిఖీ చేయాలని సూచించారు.

లక్షణాలు లేని ప్రయాణికులను ఇంటి వద్దే స్వీయ పర్యవేక్షణలో ఉంచాలని, వైరస్‌ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని 21 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని తెలిపారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను పుణెతోపాటు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోని ల్యాబ్‌ల్లో పరీక్షిస్తామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:32 AM