Share News

ఇంధన రంగంలో ఒప్పందాల జోష్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:10 AM

సీఐఐ సదస్సు వేదికగా ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌...

ఇంధన రంగంలో ఒప్పందాల జోష్‌

  • 43 వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీలు సిద్ధం

  • 17 ఎంవోయూలు.. 4700 మందికి ఉపాధి

  • రూఫ్‌టాప్‌ సోలార్‌లో దేశానికి ఏపీ ఆదర్శం: కేంద్ర మంత్రి జోషి

విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సీఐఐ సదస్సు వేదికగా ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ల సమక్షంలో వివిధ ఇంధన సంస్థలు ఏపీ ప్రభుత్వంతో రూ. 43,871 కోట్ల పెట్టుబడులకుగాను 17 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఈ కంపెనీల ద్వారా 4,700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటిలో ప్రధానంగా సౌరస్‌ ఇన్‌ఫ్రా రూ. 15,500 కోట్లు, టెక్సాల్‌ సీజీఎస్‌ గ్రీన్‌ అమ్మోనియం రూ. 10,759 కోట్లు, సన్‌షూర్‌ ఎనర్జీ రూ. 6,500 కోట్లు, బీఎల్‌ఈ రెన్యూవబుల్స్‌ రూ. 5,000 కోట్లు, అకాయా ఎనర్జీ రూ. 3,300 కోట్లు, క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ రూ. 950 కోట్లు, ఎఫ్‌సీఈఎల్‌ రాయల్‌ పవర్‌ రూ. 480 కోట్లు, క్లీన్‌ ఎడ్జ్‌ ఇండియా రూ. 240 కోట్లకు ఒప్పందాలు చేశాయి.


ఇక పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రశంసించారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ పథకం అమలులో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఐఐ సదస్సులో శుక్రవారం ఇంధన రంగంపై నిర్వహించిన ప్లీనరీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, ఏపీలో ఐదు లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుచేయాలని తాను కోరగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కలిసి రికార్డు సమయంలో ఏకంగా 7.86 లక్షల ఇళ్లకు సోలార్‌ ఏర్పాటు చేశారని అభినందించారు. దేశంలో 2014 నాటికి 2.8 గిగావాట్లు ఉన్న సోలార్‌ విద్యుత్‌ నేడు 175 గిగావాట్లకు చేరిందన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మాట్లాడుతూ, ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ ద్వారా 160 గిగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు.


సీఐఐ సదస్సు విజయవంతం: గవర్నర్‌

రాష్ట్రానికి గడిచిన రెండున్నరేళ్లలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. శుక్రవారం సీఐఐ సదస్సులో ఆయన ప్రసంగించారు. విశాఖలో తొమ్మిదోసారి సీఐఐ సదస్సు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు విజయవంతమైందని ప్రకటించారు.

ఆసియా నుంచి ఆఫ్రికా వరకు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొని ఏపీ ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని చూపించారని చెప్పారు. ఈ సదస్సులో వచ్చిన పెట్టుబడులతో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తోందని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు, తూర్పుకోస్తా రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అయ్యాయని పేర్కొన్నారు. సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన దేశ, విదేశీ ప్రతినిధులకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:14 AM