పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది
659 జడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
అమరావతి ప్రాంతంలోని 4 మండలాలకు ఎన్నికలు లేవు
మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక నిలిపివేత
కడప.. ఇతర జిల్లాలపై నివేదికలు వచ్చాక చర్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించినవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో 659 జడ్పీటీసీ స్థానాలకు, 659 మండల ప్రజాపరిషత్‌ల పరిధిలో 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు జడ్పీటీసీ, 29 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు.
ఎన్నికల అధికారుల నియామకం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ప్రజాపరిషత్‌లకు 28 మంది ఆర్వోలు, మండల ప్రజాపరిషత్‌లకు 687 మంది ఆర్వోలు, అదనంగా 1374 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తారు. పోలింగ్ నిర్వహణకు 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది ఇతర పోలింగ్ అధికారుల సేవలను వినియోగించుకోనున్నారు. మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 9966 సున్నితమైన, 9186 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
వ్యయ పరిమితి
ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ రూ.1500 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.3 వేలుగా నిర్ణయించారు. జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ రూ.3 వేలు కాగా, ఇతరులకు రూ.6 వేలుగా నిర్ణయించారు. ఎన్నికల వ్యయ పరిమితి ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించారు. శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలపై కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మైదుకూరు మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో నామినేషన్ పత్రాలు చినిగిపోయినట్లు కడప కలెక్టర్ నివేదిక ఇచ్చారన్నారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించి మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను నిలుపుదల చేశామన్నారు. కడపతోపాటు ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ మచిలీపట్నం, ఆదోని మండలాల విభజనతోపాటు న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం కావడంతో.. అన్నిచోట్లా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందన్నారు. అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు