Share News

24/7 అప్రమత్తం

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:46 AM

అర్నబ్‌, మురసు తుఫాన్లతో కోస్తా తీరం అతలాకుతలమైంది. వారం వ్యవధిలో ఆ రెండు తుఫాన్లు ఒకదాని తర్వాత మరొకటి రాష్ట్రంపై విరుచుకు పడ్డాయి. హోరుగాలులు, కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

24/7 అప్రమత్తం

  • అర్నబ్‌, మురసు తుఫాన్ల సేవల్లో కీలకంగా ఆర్టీజీఎస్‌, ఎస్డీఎంఏ

  • ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో ముఖ్య పాత్ర

  • ఆధునిక సాంకేతికత, 24 గంటలూ పర్యవేక్షణతో ప్రభుత్వానికి దన్ను

  • తుఫాన్ల గమనాన్ని నిరంతరం గుర్తిస్తూ ప్రజలకు అలెర్ట్‌ మెసేజ్‌లు

  • ప్రభుత్వ శాఖలతో సమన్వయం

  • ఎప్పటికప్పుడు దిశానిర్దేశం

  • దేశానికే ఆదర్శమంటూ కేంద్ర బృందం కితాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అర్నబ్‌, మురసు తుఫాన్లతో కోస్తా తీరం అతలాకుతలమైంది. వారం వ్యవధిలో ఆ రెండు తుఫాన్లు ఒకదాని తర్వాత మరొకటి రాష్ట్రంపై విరుచుకు పడ్డాయి. హోరుగాలులు, కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు రెండు సంస్థలు 24/7 అలుపెరగకుండా పనిచేశాయి. నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ (ఆర్టీజీఎస్‌), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(ఎస్డీఎంఏ) కీలకంగా వ్యవహరించాయి. ఈ విపత్తుల్లో ప్రభుత్వ యంత్రాంగానికి దిక్సూచిలా వ్యవహరించాయి.

గంటకు 120 కిలోమీటర్లకుపైగా వేగంతో పెనుగాలులు వీస్తూ, 20 జిల్లాలను వణించిన తుఫాన్లను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఓ వైపు సీఎం చంద్రబాబు నిరంతర సమీక్షలు, ఆదేశాలిచ్చారు. మరోవైపు ఆర్టీజీఎస్‌, విపత్తుల నిర్వహణ సంస్థలు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, ప్రజలను అప్రమత్తం చేశాయి. స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఎస్డీఎంఏ దృష్టి సారించగా, ‘మనమిత్ర’ వాట్సప్ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ఆర్టీజీఎస్‌ ప్రాధాన్యం ఇచ్చింది. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి ఆ రెండు శాఖలు చర్యలు చేపట్టాయి. మనమిత్ర యాప్‌ పనితీరును కేంద్రబృందాలు సైతం మెచ్చుకున్నాయి. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎంత పెద్దదైనా.. ప్రభుత్వ దార్శనికత, ముందస్తు వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు, నిరంతరం టెలీకాన్ఫరెన్స్‌లతో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఏకకాలంలో వేలాది మందితో మాట్లాడి సహాయ, పునరావాస చర్యలకు ఆదేశాలిచ్చారు.


హోం, వ్యవసాయ, విద్యుత్‌, జలవనరులు, రెవెన్యూ, ఇతర మంత్రులు శాఖల వారీగా సమీక్షలు, ఐఏఎస్‌ల ముందస్తు ప్రణాళికలతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటానికి దోహదపడ్డాయి. ఆర్టీజీఎస్‌, ఎస్డీఎంఏ అందించిన ముందస్తు సమాచారం, హెచ్చరికలు, మార్గనిర్దేశకాలు క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగపడ్డాయి. ఆర్టీజీఎస్‌ కేంద్రంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎన్డీఎంఏ కంట్రోల్‌ రూమ్‌ కేంద్రంగా 24 గంటలూ పర్యవేక్షణ ప్రభుత్వ సమగ్ర సన్నద్ధతకు దన్నుగా నిలిచాయి. అలాగే భారత వాతావరణ సంస్థ, తుఫాన్ల హెచ్చరిక కేంద్రం సమన్వయంతో తుఫాన్లు తీరం దాటే ప్రాంతాలను కచ్చితంగా అంచనా వేసి, కృత్రిమ మేధ, ఉపగ్రహ సమాచారాన్ని క్రోడీకరించి, ప్రభావిత ప్రజల ఫోన్లకు అలెర్ట్‌ మెస్సేజ్‌లు పంపడం ద్వారా ప్రాణాలకురక్షణ కవచాల్లా నిలిచాయి.

వీటితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, విద్యుత్‌, రెవెన్యూ, ఇతర శాఖల మధ్య ఆర్టీజీఎస్‌, ఎస్డీఎంఏ కల్పించిన సమగ్ర సమన్వయం సత్ఫలితాలిచ్చింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో రోడ్లపై పడిన చెట్లు, స్తంభాలను తొలగించి, రాకపోకలను పునరుద్ధరించేందుకు ఆ సేవలు దోహదపడ్డాయి. అలాగే లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత, పునరావాస కేంద్రాలకు తరలించడంలో క్షేత్రస్థాయి అధికారులకు మార్గనిర్దేశం చేశాయి. ఈ వరుస తుఫాన్లలో జిల్లా కలెక్టర్లు టీమ్‌ లీడర్లుగా పనిచేశారని సీఎం పేర్కొనగా, మనమిత్ర యాప్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్రబృందం కీర్తించింది.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 12:52 AM