Share News

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విజయనగరం, విశాఖపట్నం,

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Andhra Pradesh Road Accidents

అమరావతి, నవంబరు 24: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన ప్రమాదాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భోగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


మరోవైపు.. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బాటజంగాలపాలెం టోల్‌గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఇక పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:53 PM