నీ మీద.. నమ్మకం లేదు దొరా!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:48 AM
రాష్ట్రంలో సింహభాగం తహశీల్దార్ల పనితీరుపై రెవెన్యూ పెద్దలకే అనుమానాలు వచ్చాయి.
తహశీల్దార్లు మ్యుటేషన్ పత్రాలు ఇవ్వడం లేదు
పోస్టు ద్వారానే పంపిస్తాంపర్యవేక్షణ మళ్లీ తహశీల్దార్లకే
రెవెన్యూలో విచిత్ర ఆదేశాలు
తహశీల్దార్లు మ్యుటేషన్ పత్రాలు ఇవ్వడం లేదు
ఇంటికి పోస్టు ద్వారానే పంపిస్తాం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో సింహభాగం తహశీల్దార్ల పనితీరుపై రెవెన్యూ పెద్దలకే అనుమానాలు వచ్చాయి. వారి చర్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, రెవెన్యూ సేవల పట్ల తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ (ఐవీఆర్‌ఎ్‌స)లో రెవెన్యూ సేవలపై 50శాతం పైగా ప్రజల ఫిర్యాదులకు మండల స్థాయిలో రెవెన్యూ సేవలు పద్ధతి ప్రకారం జరగడం లేదన్నదే ప్రధాన కారణమని లెక్కతేల్చారు. ఈ నేపఽథ్యంలో ఇక తహశీల్దార్లతో లాభం లేదనుకొని రెవెన్యూ పెద్దలు రూటు మార్చారు. కొన్ని కీలకమైన సేవలను ఇక పోస్టల్ ద్వారా నేరుగా ప్రజలకు అందించాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పోస్టల్ సేవల పర్యవేక్షణ బాధ్యతలను మళ్లీ తహశీల్దార్లకే అప్పగించడంతో ఇదేదో మరో తిరకాసులా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ సేవలయితే సరిగ్గా చేయడం లేదని పోస్టల్ వ్యవస్థను నమ్ముకున్నారో, దాన్ని పర్యవేక్షించే బాధ్యతను మళ్లీ తహశీల్దార్లకే అప్పగించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మ్యుటేషన్ పత్రాల పోస్టల్ డెలివరీ అంశాన్ని పరిశీలిస్తే రెవెన్యూ ఫిట్టింగ్‌లు ఏమిటో? ఏమి చేయదలచుకుందో అర్థంకాక కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ తహశీల్దార్ల పని
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం(ఆర్‌ఓఆర్)-1971 ప్రకారం ప్రభుత్వ, ప్రజల భూముల రికార్డుల నిర్వహణ బాధ్యత రెవెన్యూ శాఖదే. అలాంటి శాఖలో మండలస్థాయిలో కీలక విభాగం తహశీల్దార్ వ్యవస్థ. ప్రైవేటు భూములపై లావాదేవీలు జరిగి రిజిస్ట్రేషన్‌లు పూర్తయిన తర్వాత వాటి మ్యుటేషన్‌లు చేసి సంబంధిత పత్రాలు హక్కుదారులకు అందించే బాధ్యత తహశీల్దార్‌దే. పట్టా పాస్‌బుక్‌లు అందించాల్సిన బాధ్యత కూడా తహశీల్దార్‌దే. రెవెన్యూ జాబ్‌చార్ట్ ప్రకారం వారికి క్వాజీ జ్యుడీషియరీ అధికారాలు కూడా ప్రభుత్వం కట్టబెట్టింది. వారికి ఎన్ని అధికారాలు ఉన్నా, విధులు, బాధ్యతలు ఎవరైనా సక్రమంగా నిర్వహించకపోతే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ శాఖకు ఉంది. అంటే తహశీల్దార్లకు ప్రభుత్వం అన్నా, రెవెన్య శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ, ఇతర అధికారులు అన్నా భయం, గౌరవం, జవాబుదారీతనం ఉండాలి. తహశీల్దార్ వ్యవస్థను నియంత్రించాల్సిన రెవెన్యూ శాఖనే చేతులెత్తేస్తే? తహశీల్దార్లు పనిచేయడం లేదని, ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని చెబితే? ఇప్పుడు అదే జరుగుతోందని ఇటీవల జిల్లా కలెక్టర్లకు అందిన ఓ రెవెన్యూ ఆదేశం స్పష్టం చేస్తోంది. రెవెన్యూ ఆఫీసుల్లో మ్యుటేషన్ పత్రాలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇకపై ఆ పత్రాలను పోస్టు ద్వారా పంపించాలని, ఇందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా హక్కుదారుల ప్రస్తుత చిరునామా తెలుసుకొని, మ్యుటేషన్ పత్రాలు పంపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీని అమలుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. చిరునామాల సేకరణ, పోస్టులో పత్రాల పంపిణీ పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్‌దే అని పేర్కొన్నారు.
తహశీల్దార్లపై నమ్మకం లేకనే
ఈ నెల 21న సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి కలెక్టర్లకు ఉత్తర్వులు పంపించారు. మ్యుటేషన్‌లు జరుగుతున్నా అందుకు సంబంధించిన పత్రాలు హక్కుదారులకు ఇవ్వడంలో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. ప్రత్యామ్నాయంగా రెవెన్యూ శాఖ చేపట్టిన అంశాలను సీసీఎల్‌ఏ అందులో పొందుపరిచారు. మ్యుటేషన్ పత్రాలను హక్కుదారులకు అందించడం లేదని, ఇకపై ఆ పత్రాలను పోస్టు ద్వారా హక్కుదారులకు అందించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. నిజానికి మ్యుటేషన్ పూర్తయ్యాక పత్రాలను హ క్కుదారులకు అందించాల్సినది తహశీల్దారే. అంటే.. హక్కుదారులకు పత్రాలు ఇవ్వనిది తహశీల్దార్లే కదా? ఈ అనుమానాన్ని సీసీఎల్‌ఏ నివృత్తి చేశారు. ఆ ఉత్తర్వును పరిశీలిస్తే.. ‘ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ(ఐవీఆర్‌ఎస్ కాల్స్)లో 40-50 శాతం మంది తమకు భూముల లావాదేవీల అనంతరం (రిజిస్ట్రేషన్‌లు అయ్యాక) సవరించిన మ్యుటేషన్ పత్రాలను తహశీల్దార్ ఆమోదించిన తర్వాత కూడా అందించడం లేదని చెబుతున్నారు. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది’ అని సీసీఎల్‌ఏ చాలా స్పష్టంగా ప్రస్తావించారు. దీనర్థం.. తహశీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ పత్రాలు ప్రజలకు సరిగ్గా అందించడం లేదనే. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 40-50 శాతం ఇవేనని కూడా పేర్కొన్నారు.
మరి ప్రక్షాళన ఏదీ?
మ్యుటేషన్ పూర్తయ్యాక తహశీల్దార్ ఆమోదించిన పత్రాలు హక్కుదారులకు ఇవ్వకపోవడం పెద్ద తప్పు. అది రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతోందని ప్రభుత్వం, సీసీఎల్‌ఏ గుర్తించిన తర్వాత ఏం చేయాలి? మండల రెవెన్యూ ఆఫీసులను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎందుకు పత్రాలు ఇవ్వడం లేదో గుర్తించి చర్యలు చేపట్టాలి. ప్రజా ఫిర్యాదుల ఆధారంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల మిగతావారిలో భయం వస్తుంది. అప్పటికీ మార్పు రాకపోతే అధికారులకు జవాబుదారీని ఫిక్స్ చేయాలి. విజిలెన్స్ విభాగాలను ఏర్పాటు చేసి నియంత్రణ తీసుకురావాలి. ఈ అధికారం ఇటు కలెక్టర్లకు, అటు రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏకు ఉంది. పాలనాపరంగా ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాలి. మరి రెవెన్యూ పెద్దలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారా? అంటే.. అదేం లేదు. ప్రక్షాళనకు బదులుగా తహశీల్దార్లకే మరో బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను వారు సరిగ్గా చేస్తున్నారో లేదో కలెక్టర్లు, ఆర్‌డీఓలు పర్యవేక్షించాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వు జిల్లా కలెక్టర్లకు ఏమాత్రం బోధపడటం లేదు. రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని చె బుతూ, ఆ వ్యవస్థను సంస్కరించమని చెప్పకుండా అందుకు పూర్తి భిన్నంగా మరో బాధ్యతను అప్పగించడమే కారణం.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం