రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:01 AM
ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల వసూళ్లు అక్టోబరు 2026 నెలలో సరికొత్త రికార్డులు సృష్టించాయని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
20 శాతం వృద్ధితో రూ.5329 కోట్ల వసూళ్లు
రాజధాని నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ల వల్లే ఈ వృద్ధి
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల వసూళ్లు అక్టోబరు 2026 నెలలో సరికొత్త రికార్డులు సృష్టించాయని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు గత ఏడాది ఇదే నెలలో రూ.4,458 కోట్లు వసూలు కాగా, ఇప్పుడు 20 శాతం వృద్ధితో రూ.5329 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. అక్టోబరు 2026లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,582 కోట్లకు చేరాయి. గత ఏడాది కంటే 19 శాతం అంటే రూ.562 కోట్లు ఎక్కువ. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్టోబరు నెలలో నమోదైన వసూళ్లలో ఇదే అత్యధికం. స్థూల జీఎస్టీ వసూళ్లు 24 శాతం వృద్ధితో రూ.4,307 కోట్లుగా నమోదయ్యాయి. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 16 శాతం కంటే అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.35,765 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెట్రోలియం వ్యాట్ 23 శాతం వృద్ధితో రూ.1577 కోట్లు సాధించింది.
వృత్తి పన్ను 23 శాతం వృద్ధితో రూ.45 కోట్లు, ఐజీఎస్టీ సెటిల్మెంట్ 17 శాతం వృద్ధితో రూ.2077 కోట్లు వచ్చాయి. అక్టోబరు 2026లో ఇనుము, ఉక్కు రంగం అత్యధికంగా 104 శాతం వృద్ధి నమోదుచేసింది. ప్లాస్టిక్ రంగం 34 శాతం, ఆటోమొబైల్స్ 20 శాతం, యంత్రాల రంగం 20 శాతం వృద్ధిని కనబరచాయి. సేవారంగంలో నిర్మాణ సేవలు 60 శాతం వృద్ధితో ముందున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం, రహదారులు, పారిశ్రామిక కారిడార్ల వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్లే ఈ భారీ వృద్ధి సాధ్యమైందని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం