నేడు కోస్తా, సీమలో మోస్తరు వర్షాలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:48 AM
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, అక్కడక్కడా భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, అక్కడక్కడా భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. గురువారం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
యడ్లపాడులో 25.98 సెం.మీ. వర్షం
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్నాడు జిల్లా యడ్లపాడులో అత్యధికంగా 25.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా కరిచర్లగూడెంలో 23.02, సగ్గొండలో 22.42, జీలుగుమిల్లిలో 22.09, పి.నారాయణపురంలో 22.07, ఏలూరు జిల్లా బయ్యన్నగూడెంలో 18.2, కాకినాడ జిల్లా పెదపూడిలో 14.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. గడిచిన 48 గంటల్లో 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా పశ్చిమగోదావరిలో 157.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాకు ఆనుకుని తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండంతో ఏలూరు జిల్లాకు వరద పోటెత్తుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ నెల 12వ తేదీ తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. ఇది బలపడుతుందా? లేదా అనేది రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్