సెమీకండక్టర్ 2.0 రాష్ట్రంలో కొత్త పాలసీ సిద్ధం
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:46 AM
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ , రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలకు ఊతమిచ్చేలా పాలసీలు సిద్ధమయ్యాయి
రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పాలసీలు కూడా..
తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చేలా రూపకల్పన
పెట్టుబడుల ఆకర్షణకు భారీగా రాయితీలు
సెమీకండక్టర్, రోబోటిక్స్ ప్రాజెక్టులకు ప్రత్యేక పార్కులు
మార్గదర్శకాలు విడుదల చేసిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ , రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలకు ఊతమిచ్చేలా పాలసీలు సిద్ధమయ్యాయి. ఆయా పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహకాలు అందించి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని సోమవారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ విడుదల చేశారు. 2020లో కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్, రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో పరికరాల కొరత పెరిగింది. దీంతో భారత్‌లోనే ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. ఈమేరకు కేంద్రం పాలసీలు రూపొందించింది. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆ 3 రంగాలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సెమీ కండక్టర్.. రోబోటిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పాలసీలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సాయం లభిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో సెమీకండక్టర్ 2.0 పాలసీని తయారు చేశామని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ వెల్లడించింది. డిజైన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయుతీలో 50 శాతం వరకు, కమర్షియల్ డిజైన్లలోనూ కేంద్ర ఇచ్చే రాయితీల్లో 50 శాతం అందిస్తామని వెల్లడించింది. డెప్లాయ్‌మెంట్ లింక్డ్ కేటగిరిలో కేంద్రం రాయితీలో 50 శాతం, మెషీన్లు- మెటీరియల్స్‌లో 60 శాతం రాయితీని ఇస్తారు. సిలికాన్ ఫ్యాబ్స్‌కు కేంద్రం ఇచ్చే రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వమూ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. కాంపౌండ్ సెమీకండక్టర్, సెన్సర్ అండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌కూ, డిస్‌ప్లే ఫ్యాబ్స్‌కూ కేంద్రం అందించే పెట్టుబడి రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుంది. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టే మెగా సంస్థలకు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు రూ. 5,000 కోట్లకు పైబడి ప్రోత్సాహకాలను అందిస్తారు. ఈ సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులకు నిరంతరాయంగా విద్యుత్తు, నీటి సరఫరాను అందిస్తుంది.
ఏపీ రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ
రాష్ట్రంలో ఏపీ రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీని రాష్ట్ర ఐటీశాఖ విడుదల చేసింది. ఇండస్ట్రియల్, కొలాబరేటివ్, అటానమస్ మొబైల్, స్పెషలైజ్డ్ సర్వీస్ రోబోల తయారీకి ప్రోత్సాహకాలను అందించేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ రాయితీలను ప్రకటిస్తూ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిజికల్ ఏఐ, ఇంటిగ్రేటెడ్ స్పెసిఫికల్ ఇంటెలిజెన్స్ మోడల్‌తో కూడిన రోబోలు, ప్లాన్ అండ్ యాక్ట్ రోబోల తయారీ రంగానికి ఈ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 9,123 ఇండస్ట్రియల్ రోబోలు 2024లో నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 4.0.. డ్రోన్ పాలసీ, స్పేస్ పాలసీ, సెమీకండక్టర్ డిస్‌ప్లే అండ్ ఫ్యాబ్ పాలసీ, సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ పాలసీ, అమరావతి క్వాంటం వ్యాలీ ఇనీషియేషన్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగానే రూపొందిన రోబోటిక్స్ పాలసీని కూడా కాటమనేని భాస్కర్ విడుదల చేశారు. చెన్నై-బెంగళూరు, విశాఖ- చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో ఈ రోబోటిక్స్ పాలసీని అమలు చేస్తారు. ఇప్పటికే ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలోనూ.. తిరుపతిలో స్థాపించే స్పేస్‌సిటీలోనూ రోబోటిక్స్ వినియోగం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. రోబోటిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు మూడేళ్లలో 80శాతం ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తే 25నుంచి 50శాతం వరకూ పెట్టుబడి రాయితీ లభిస్తుంది. మధ్యస్థస్థాయి పెట్టుబడులకు రూ.50 నుంచి రూ.200 కోట్లు, భారీ ప్రాజెక్టులకు రూ. 1,000 కోట్లు, మెగా ప్రాజెక్టులకు రూ.1,000 కోట్ల నుంచి రూ. 5000 కోట్లు, అలా్ట్ర మెగా ప్రాజెక్టుకు రూ. 5000 కోట్లకు పైగా రాయితీ దక్కుతుంది. ఎస్‌జీఎస్టీ, స్టాంపు డ్యూటీలో 100 శాతం రాయితీ ఇస్తారు. పరిశోధన, అభివృద్ధికీ ప్రోత్సాహకాలు లభిస్తాయి. రోబోటిక్స్ తయారీ కోసం ప్రత్యేక పార్కులను ఏర్పాటు చేస్తారు.
యానిమేషన్ రంగంలో 5 వేల కోట్ల ఆకర్షణకు
రాష్ట్ర యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీఎక్స్‌ఆర్)పాలసీ-2026ను కూడా సోమవారం విడుదల చేశారు. ఈ రంగంలో రూ.5,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 50 శాతం సబ్సిడీని రూ.2కోట్ల దాటకుంటా ఇస్తారు. ఏవీజీసీఎక్స్‌ఆర్ పార్కుల పెట్టుబడుల్లో 25శాతం రాయితీని రూ.50 కోట్లకు మించకుండా అందిస్తారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.25 కోట్లదాకా రాయితీని అందిస్తారు. ఈ సంస్థలకు అద్దె సహకారాన్ని ఇస్తా రు. ఐదేళ్ల దాకా 100శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ, పెట్టుబడుల స్థాయి, ఉద్యోగాల కల్పనను బట్టి రూ.200 కోట్లదాకా రాయితీ లభిస్తుంది.
విశాఖలో సెమీ కండక్టర్ ఎస్‌ఈజెడ్
విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో సెమీకండక్టర్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్‌ఈజెడ్) ఏర్పాటుకు వీలుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసింది. తర్లువాడలోనే గూగుల్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మిస్తోంది. దానికి సమీపంలోనే సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమలకు ఈఏడాది ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దానిని ఎస్‌ఈజెడ్‌గా కేంద్రం నోటిఫై చేసింది. తర్లువాడలో 28 ఎకరాలు, పక్కనే గిడిజాలలో 2 ఎకరాలు కలిపి మొత్తం 30 ఎకరాల్లో ఎస్‌ఈజెడ్ అభివృద్ధి చేస్తారు. దక్షిణ భారతదేశంలో మొదటి సెమీకండక్టర్స్ తయారీ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టును అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ఏఎస్‌ఐపీ) టెక్నాలజీస్ సంస్థ చేపట్టింది. దీనికి మొత్తం రూ. 2,460 కోట్లు వెచ్చిస్తుంది. మొదటి దశలో రూ. 460 కోట్లు, రెండో దశలో రూ.2వేల కోట్లు ఖర్చుచేస్తుంది. ఇక్కడ ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్లను తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా1,000 మందికి, పరోక్షంగా 1,600మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఎస్‌ఈజెడ్‌కు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూపాయి చొప్పున కేటాయించింది. ఏఎస్‌ఐపీ సంస్థ ఇదే ప్రాంగణంలో 2.5 డి, 3డి ప్యాకేజింగ్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయనుంది.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్