‘కట్’ కట!
ABN , Publish Date - May 14 , 2026 | 05:16 AM
మండు వేసవిలో వినియోగదారులకు విద్యుత్తు శాఖ చుక్కలు చూపిస్తోంది. లైన్ మెయింటెనెన్స్.. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్.. పేరు ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనధికార కోతలు అమలవుతున్నాయి..
అనధికార కరెంటు కోతలతో కష్టాలు
సిబ్బంది కొరతే అసలు సమస్య
1500 మంది ఏఈ స్థాయి అధికారులకుగానూ ఉన్నది 800 మంది ఏఈలే
ఓఅండ్‌ఎం విభాగంలో 2 వేల మంది కొరత
నిర్వహణ లోపాలతో అనధికార కోతలు
మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్తు సగటు వినియోగం 260 మిలియన్ యూనిట్లు
మేలో గణనీయంగా తగ్గిన వినియోగం
సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్లే
డిమాండ్ తగ్గినా తప్పని అంతరాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మండు వేసవిలో వినియోగదారులకు విద్యుత్తు శాఖ చుక్కలు చూపిస్తోంది. లైన్ మెయింటెనెన్స్.. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్.. పేరు ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనధికార కోతలు అమలవుతున్నాయి. వాస్తవానికి గత రెండు నెలలతో పోల్చుకుంటే ఈ నెల ప్రారంభం నుంచి విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గింది. అయినా అనధికార కోతలు తప్పడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సగటు వినియోగం రోజుకు 260 మిలియన్ యూనిట్లుగా ఉంది. మే నెలలో ఇప్పటి వరకు సగటు వినియోగం 250 మిలియన్ యూనిట్లుగానే ఉంటోంది. ఈ ఏడాది మార్చి 7న 274.6 మిలియన్ యూనిట్ల గరిష్ఠ వినియోగం నమోదు కాగా, ఏప్రిల్ 24న 278.44 మిలియన్ యూనిట్ల గరిష్ఠ వినియోగం నమోదైంది. ప్రస్తుతం గత రెండు రోజులుగా 250-260 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది.
ఇవీ కారణాలు
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అధికారిక కోతలు లేవు. కానీ మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అనధికార కోతలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిర్వహణ పనులను ప్రతి నెలా 2వ శనివారం మాత్రమే చేయాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఎప్పుడంటే అప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతులకు గంటల తరబడి సమయం తీసుకుంటున్నారు. గాలులకు ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. వీటిని గాడిలో పెట్టేందుకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే క్షేత్రస్థాయిలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్‌ఎం) విభాగంలో పనిచేయాల్సిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడిన సమయంలో తక్షణ స్పందన ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాల్సి ఉంది. వీరిలో సగానికిపైగా ఓఅండ్‌ఎం విభాగంలోనే పనిచేయాల్సి ఉంది. కానీ ఓఅండ్‌ఎం విభాగంలో సుమారు 2 వేల మంది సిబ్బంది కొరత ఉంది. ఏఈ స్థాయి అధికారులు సుమారు 1500 మంది వరకు ఉండాల్సి ఉండగా కేవలం 800 మందితో నెట్టుకొస్తున్నారు. ఇవన్నీ విద్యుత్తు అంతరాయాల సమయంలో సరఫరా పునరుద్ధరణపై ప్రభావం చూపిస్తున్నాయి.
జిల్లాలలో కోతలు
విశాఖపట్నం జిల్లాలో మరమ్మతుల పేరిట గంట నుంచి రెండు గంటలు అనధికార విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. రెండో శనివారంతోపాటు మిగిలిన రోజుల్లో కూడా మరమ్మతులు, నిర్వహణ పేరుతో కోతలు విధిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో అనధికార విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి గాలి వీచినా దానిని సాకుగా చూపి కోతలు విధిస్తున్నారు. లైన్ మెయింటెనెన్స్, ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కోతలు విధిస్తుండటంతో వేసవి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అనధికార విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓవర్‌లోడ్, మరమ్మతుల పేరుతో అనధికారికంగా గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి సమయంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడితే వాటిని సరిచేసే పరిస్థితి లేకుండాపోయింది. చిన్నపాటి గాలులు వీచినా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది. దాన్ని పునరుద్ధరించడంలో విద్యుత్తు శాఖ అధికారులు విఫలమవుతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో ఓవర్ లోడ్ కారణంగా తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ విద్యుత్తు సరఫరాలో 15 నిమిషాల నుంచి గంట వరకు కోతలు పెడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలు అమలు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఆదివారం రాత్రి ఈదురుగాలుల కారణంగా జంగారెడ్డిగూడెంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి. 24 గంటలు గడుస్తున్నా ఇంకా పలు ప్రాంతాల్లో పునరుద్ధరణ జరగలేదు.