‘నల్లమలసాగర్’పై కృష్ణా బోర్డులో చర్చలేంటి?
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:20 AM
పోలవరం- నల్లమల సాగర్ అనుసంధాన పథకం గురించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సర్వసభ్య సమావేశంలో చర్చించాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేయాలని ఏపీ నిర్ణయించింది. కేఆర్‌ఎంబీ విస్తృత స్థాయి సమావేశం 26న జరగాల్సి ఉంది.
మా వాటాగా 66 శాతం కృష్ణా జలాలు ఇవ్వాల్సిందే
ఎల్లుండి కేఆర్‌ఎంబీ సమావేశం
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం- నల్లమల సాగర్ అనుసంధాన పథకం గురించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సర్వసభ్య సమావేశంలో చర్చించాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేయాలని ఏపీ నిర్ణయించింది. కేఆర్‌ఎంబీ విస్తృత స్థాయి సమావేశం 26న జరగాల్సి ఉంది. అయితే.. ఆ రోజున తాము హాజరు కాలేమని తెలంగాణ సమాచారం ఇచ్చింది. దీంతో ఈ సమావేశాన్ని నవంబరు 2కు వాయిదా వేయాలని బోర్డు భావించింది. అయితే శ్రీశైలం డ్యాంలో అంతంతమాత్రంగా ఉన్న కృష్ణా జలాలను పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ విచ్చలవిడిగా తోడేస్తున్నందున తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది.
దీంతో 27న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. ఈ సమావేశంలో పోలవరం- నల్లమల సాగర్‌పై చర్చించాలని తెలంగాణ పట్టుబడుతూ అజెండాలో చేర్చడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి జలాలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉండగా.. కేఆర్‌ఎంబీకి ఏం సంబంధమని ఏపీ వాదిస్తోంది. కాగా, శ్రీశైలం ప్లంజ్‌పూల్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టే అంశాన్ని అజెండాలో చేర్చారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతం అవల నుంచి ఏపీ 200 టీఎంసీలు తోడేసిందంటూ తెలంగాణ పేర్కొనడంతో పాటు కృష్ణా జలాల్లో 71:29 నిష్పత్తిలో వాటాలు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌పైనా ఏపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం జలాలు మాత్రమే కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేస్తోంది. పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ ద్వారా కృష్ణాజలాలను తోడేస్తున్నారన్న తెలంగాణ వాదనపైనా ఏపీ ఘాటుగా స్పందించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగుకు కృష్ణాజలాలను తెలంగాణ అందిస్తోందని ఆరోపిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి: