పురపోరు ప్రశాంతం!
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:53 AM
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ఆద్యంతం ప్రశాంతంగా సాగింది

చెదురుమదురు ఘటనలు మినహా సాఫీగా పోలింగ్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ఆద్యంతం ప్రశాంతంగా సాగింది. ఒకటి రెండు చోట్ల వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ పోలింగ్ ప్రక్రియకు ఎక్కడా విఘాతం కలగలేదు. ఇక, పోలింగ్‌లో మహిళా ఓటర్ల సందడి ఎక్కువగా కనిపించింది. పలు బాపట్ల జిల్లా రేపల్లెలోని 30, 31 వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ ఇన్‌చార్జి నాగమోహనకృష్ణ హడావుడి చేయడంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. పిఠాపురంలో 18వ వార్డులో కాసేపట్లో పోలింగ్ ముగుస్తుందనగా, జనసేన అభ్యర్థి పనిపై బయటకు వెళ్లి మళ్లీ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగి, జనసేన ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలీసులతో గొడవపడ్డారు. తిరుపతి నగరం 36వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో జనసేన వర్గీయులు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలింగ్ అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో జరిగిన తోపులాటలో టేబుల్ తగిలి ఒక ఉద్యోగిని గాయపడ్డారు. 17వ వార్డు పోలింగ్ కేంద్రం లో టీడీపీ అభ్యర్థి భర్త, ఏజంట్ గంగరాజుపై వైసీపీ ఏజంట్ జనార్దనరెడ్డి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వైసీపీ ఏజంట్‌పై కేసు నమోదు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాదాఖలందర్‌పై వైసీపీ అభ్యర్థి అనిల్, అతని అనుచరులు కుర్చీలతో దాడి చేశారు. దాదాపు 2 గంటలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో వైసీపీ నేతలు కొందరు రౌడీషీటర్లను వెంటబెట్టుకుని వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. దీంతో ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. చీరాల 36వ వార్డులో డబ్బులు పంచుతున్న వైసీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ వైసీపీ మేయర్ అభ్యర్థి శ్రీదేవి బూత్‌లోకి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా భైఠాయించి నిరసన తెలిపారు. ఆ సమయంలో బ్యాలెట్ బాక్సు కిందపడిపోయి అప్పటికే పోల్ అయిన బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చాయి. వెంటనే వాటిని బాక్సులో పెట్టి సీల్ వేశారు. తెనాలిలోని ఐతానగర్, సుల్తానబాద్‌లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల కవ్వింపులతో ఘర్షణ వాతావరణం నెలకొం
గుర్తులు’ మారి గందరగోళం
బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థులకు చెందిన పార్టీ గుర్తులు తప్పుగా ముద్రణకావడంతో పలు చోట్ల గందరగోళం నెలకొంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాల్టీ 3వ వార్డులో టీడీపీ అభ్యర్థి గుర్తుకు బదులు కమలం గుర్తు ముద్రించారు. 7వ వార్డులో ఓటువేసే స్లిప్పులో బీజేపీ అభ్యర్థి గుర్తు సరిగ్గా కనిపించలేదు. దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపర్‌లో వైసీపీ అభ్యర్థి హసన్‌బాషా పేరు ఎదురుగా హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదురుగా ఫ్యాన్ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్‌ను నిలుపుదల చేసి హుటాహుటిన మళ్లీ బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇక్కడ రెండున్నర గంటలపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 35వ వార్డు బ్యాలెట్ పత్రాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల పేర్లు తారుమారయ్యాయి. దీంతో యుద్ధప్రాతిపదికన తిరుపతి నుంచీ మళ్లీ బ్యాలెట్ పత్రాలు ముద్రించి తెప్పించారు. గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
పోలింగ్ ‘చిత్రాలు’
నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా మోటారు సైకిల్‌పై నెల్లూరు నగరంమంతా తిరుగుతూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
చీరాలలోని 15వ వార్డు పరిధిలో తమ కుటుంబంలోని 15 మంది ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని ఓటరు నిలదీశారు.
పార్వతీపురంలో పల్లిరెడ్డి అరుణకుమారి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా ఆమె మృతి చెందినట్టు అధికారులు వద్ద ఉన్న జాబితాలో ఉంది. దీనిపై ఆమె అధికారులతో చర్చించి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు విషయంలో కొందరు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. చీరాలలో 93 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 42వ వార్డుకు చెందిన 105 ఏళ్ల కాశమ్మ నింపాదిగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేశారు. పోలింగ్ అధికారులు దగ్గరుండి ఓటు వేయించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటేనే మంచి పరిపాలకుడు వస్తాడని ఆమె యువతకు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పదో వార్డు పోలింగ్ కేంద్రంలో 95 ఏళ్ల వృద్ధురాలు రమాదేవి ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీల్‌చైర్‌పై వచ్చి ఓటేసి ఆశ్చర్యపరిచారు.
తునిలో ట్రాన్స్‌జెండర్లు బృందంగా వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..