Share News

‘పుర పోరు’ ఒకటిన

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:09 AM

రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సవరించింది.

‘పుర పోరు’ ఒకటిన

  • మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ సవరిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం

  • కౌంటింగ్‌ 3న

  • మైదుకూరులో మొత్తం 32 వార్డులకూ మళ్లీ నామినేషన్లు

  • తిరుపతిలో 18 వార్డులకు.. కడప, రాజంపేటల్లో 11 చొప్పున మాత్రమే

  • వాటికి నేడు, రేపు నామినేషన్ల దాఖలు

  • ఎల్లుండి ఉదయం పరిశీలన..

  • మధ్యాహ్నం 3 వరకు ఉపసంహరణ

  • ఎల్లుండే మొత్తం 100 పట్టణ స్థానిక

  • సంస్థల అభ్యర్థుల తుది జాబితా!

  • ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో

  • రెండ్రోజులుగా ఎన్నికల సంఘం చర్చలు

  • సుప్రీం ఉత్తర్వులపై సుదీర్ఘ మంతనాలు

  • కలెక్టర్లు, ఎస్పీల నివేదికలు పునఃపరిశీలన

  • అనంతరంపై కీలక నిర్ణయాల వెల్లడి

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సవరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను నవంబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది. మూడో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది. అలాగే మైదుకూరు మున్సిపాలిటీలో తాజాగా మొత్తం వార్డులకు నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది.


కడప కార్పొరేషన్‌లో 11 వార్డులు, తిరుపతి కార్పొరేషన్‌లో 18 వార్డులు, రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులకు మాత్రం నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించింది. ఈ నాలుగు చోట్లా శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటారు. 25న ఉదయం వాటిని పరిశీలిస్తారు. వాటిని ఉపసంహరించుకునేందుకు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువిచ్చారు. 3 గంటల తర్వాత మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. కడప, తిరుపతి, రాజంపేట, మైదుకూరుల్లో తప్ప మరెక్కడా కొత్తగా నామినేషన్లు స్వీకరించాల్సిన అవసరం లేదని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. 19 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ఆయా చోట్ల ఏవైనా ఫిర్యాదులు అంది ఉంటే వాటిని మరోసారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఎస్‌ఈసీని ఆదేశించడం.. అన్ని పట్టణ సంస్థల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను 25వ తేదీ వరకు ఆపాలని నిర్దేశించడం, దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పటివరకు తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా ఆపేయడం తెలిసిందే.


సుప్రీంకోర్టు తీర్పుపై ఎస్‌ఈసీ బుధ, గురువారాల్లో ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి మళ్లీ నివేదికలు తెప్పించుకుని పునఃపరిశీలించింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ కమిషనర్‌, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు.. న్యాయవాదులతో విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మైదుకూరు, కడప, రాజంపేట, తిరుపతి మినహా మరెక్కడా నామినేషన్ల ప్రక్రియకు భంగం వాటిల్లలేదని ఎస్‌ఈసీ నిర్ధారించింది. అక్కడక్కడా గొడవలు జరిగినా నామినేషన్ల ప్రక్రియపై వాటి ప్రభావం ఏ మాత్రం లేదని కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తేల్చింది.

దరిమిలా.. మైదుకూరులో మొత్తం 32 వార్డులకు.. కడప, రాజంపేట, తిరుపతిల్లో కొన్నేసి వార్డులకు మరోసారి నామినేషన్లు స్వీకరించాలని నిశ్చయించింది. నవంబరు 1వ తేదీన మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు పోలింగ్‌ జరుగుతుంది. రీపోలింగ్‌ అవసరమైతే మర్నాడు నిర్వహిస్తారు. 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ వివరాలను సుప్రీంకోర్టుకు 27వ తేదీన నివేదించనుంది.

మళ్లీ నామినేషన్లు స్వీకరించే వార్డులివే..

మైదుకూరు మున్సిపాలిటీ: మొత్తం 32 వార్డులు

కడప కార్పొరేషన్‌: 11 వార్డులు (6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55)

రాజంపేట మున్సిపాలిటీ: 11 వార్డులు (6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27)

తిరుపతి కార్పొరేషన్‌: 18 వార్డులు (1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66)

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 04:13 AM