పుర పోరుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:04 AM
రాష్ట్రంలో పట్టణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారంతో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్ జరగనుంది.
రేపే 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్
మరో 8 చోట్ల పూర్తి స్థాయిలో ఏకగ్రీవం
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు
13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలకు
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి.. ముగిసిన ప్రచారం
అధికారం, ఆధిపత్యంపై ప్రధాన పార్టీల గురి
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారంతో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలు ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకటించిన 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 17 ‘మున్సిపల్’ చైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 8 చోట్ల అన్ని వార్డులతో సహా పూర్తి స్థాయిలో ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన చోట్ల ఎక్కువ వార్డులు ఏకగ్రీవమవగా, కొన్ని వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత అక్టోబరు 28న పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల ప్రక్రియలో కీలకమార్పులు జరిగాయి. దీంతో పోలింగ్‌ను నవంబరు 1కి వాయిదా వేశారు. అవసరమైన చోట 2న రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో గెలుపు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న గ్రేటర్ విశాఖ, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగరాల్లో మేయర్ పీఠం దక్కించుకోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో తమ రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ సారి మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు.
ఏకగ్రీవాల్లో కూటమిదే పైచేయి
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో అధికార కూటమి ఆధిక్యం ప్రదర్శించింది. టీడీపీకి అత్యధిక స్థానాలు 15, జనసేన, బీజేపీలకు చెరో స్థానం దక్కాయి. అలాగే కూటమి మద్దతుతో 639 మంది వార్డు, డివిజన్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ ఎన్నికల్లో కూటమి పట్టణ ప్రాంతాల్లో తమ పాలనకు ప్రజామోదం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరముంది. మరోవైపు వైసీపీకి పట్టణ ఓటర్లలో తమ బలాన్ని తిరిగి చాటుకోవాల్సిన సవాల్ ఎదురవుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారాస్త్రాలుగా కూటమి మలచుకుంటోంది. అత్యధిక స్థానాల్లో గెలవాలని టీడీపీ, కూటమిలో భాగస్వామిగా పోటీ చేస్తున్న స్థానాల్లో తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని జనసేన చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తన ఉనికిని విస్తరించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక సమస్యలు, నామినేషన్ల సందర్భంగా ఎదురైన ఇబ్బందులను ప్రధాన ప్రచార అంశాలుగా వైసీపీ ముందుకు తెస్తోంది.
ప్రచారానికి తెర... పోలింగ్‌పై ఉత్కంఠ
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజున ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు అన్నీ ప్రయత్నాలు చేశారు. ఇంటింటి ప్రచారం, స్థానిక సమస్యలపై హా మీలతో ప్రచారం హోరెత్తింది. పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. గతంలో నామినేషన్లు సందర్భంగా వివాదాలు తలెత్తిన నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో భద్రత, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కీల కంగా మారాయి. మరోవైపు పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఓటర్లు అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.
ఓటరు తీర్పుపైనే అందరి దృష్టి
నవంబరు 1న జరిగే పోలింగ్‌లో పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది. అధికార కూటమి తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుందా? మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్వీప్ చేస్తుందా? వైసీపీ గట్టి పోటీ ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంటుందా? కార్పొరేషన్లలో మేయర్ పీఠాలు ఎవరికి దక్కుతాయి? అన్నది నవంబరు 3న వెలువడే ఫలితాల్లో తేలనుంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు మరో కీలక పరీక్షగా మారాయి. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలకు అద్దం పట్టడమే కాకుండా రాజకీయ పరిణామాలపైనా ప్రభావం చూపే అవకాశముంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?