రాష్ట్రంలో 4,196 మెడికల్ పీజీ సీట్లు
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:59 AM
రాష్ట్రంలో మొత్తం పీజీ వైద్య సీట్ల సంఖ్య 4,196కు చేరిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతితో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొత్తగా..
కొత్తగా 424 సీట్లు పెంచిన ఎన్‌ఎంసీ
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొత్తం పీజీ వైద్య సీట్ల సంఖ్య 4,196కు చేరిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతితో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొత్తగా 424 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు 162, ప్రైవేటు వైద్య కళాశాలలకు 262 చొప్పున ఉన్నాయని శనివారం ఓ ప్రకటనలో వివరించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 1,915 నుంచి 2,077కు పెరిగిందని, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,857 నుంచి 2,119కు చేరిందన్నారు. ప్రస్తుతం పీజీ వైద్య సీట్ల తొలి విడత కౌన్సెలింగ్ కొనసాగుతుండగా, రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల మూడో వారంలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో ఎన్‌ఎంసీ తాజాగా మంజూరు చేసిన సీట్లను కూడా కౌన్సెలింగ్‌లో కలిపి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
గత మూడేళ్లలో రాష్ట్రంలో పీజీ వైద్య సీట్ల సంఖ్య 3,288 నుంచి 4,196కు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఈ జాబితాలో చేరిందని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..