Share News

‘స్థానికం’ హోరాహోరీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:33 AM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొత్తం 50,815 నామినేషన్లు ఆమోదం పొందాయి. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీ స్థానాలకు, 659 జెడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 3న ఎన్నికలు నిర్వహించనున్నారు.

‘స్థానికం’ హోరాహోరీ

  • పరిషత్‌ ఎన్నికలకు 50,815 నామినేషన్లు చెల్లుబాటు

  • 9829 ఎంపీటీసీ స్థానాలకు 46,045

  • 659 జెడ్పీటీసీ స్థానాలకు 4770

  • 6811 నామినేషన్లు తిరస్కరణ

  • ఉపసంహరణకు రేపే గడువు..

  • తుది జాబితా అదేరోజు

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొత్తం 50,815 నామినేషన్లు ఆమోదం పొందాయి. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీ స్థానాలకు, 659 జెడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 46,045 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 4770 మంది చెల్లుబాటయ్యే అభ్యర్థులుగా నమోదయ్యారు. నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. ఈ నెల 27వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా అదేరోజు వెల్లడవుతుంది. ఆయా పార్టీల వారీగా ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసినవాటిలో 6811 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 5857, జెడ్పీటీసీ ఎన్నికలకు 954 నామినేషన్లు అనర్హతకు గురయ్యాయి.

ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధికంగా 19,760 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి 17,726 మంది పోటీలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి 4330, స్వతంత్ర అభ్యర్థులు 2012, బీజేపీ నుంచి 1049, కాంగ్రెస్‌ నుంచి 439, సీపీఎం నుంచి 353, ఇతర పార్టీల నుంచి 219, బీఎస్పీ నుంచి 155 మంది, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు చెల్లుబాటయ్యే నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లోనూ టీడీపీ నుంచి అత్యధికమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 1693 మంది, వైసీపీ నుంచి 1445, జనసేన నుంచి 587, కాంగ్రెస్‌ నుంచి 316, బీజేపీ నుంచి 227, స్వతంత్ర అభ్యర్థులు 227, ఇతర పార్టీల నుంచి 74, సీపీఎం నుంచి 69, బీఎస్పీ నుంచి 122, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి 10 మంది చెల్లుబాటయ్యే అభ్యర్థులుగా నమోదయ్యారు.


ఎన్నికల నియమావళి కింద 6184 కేసులు

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కచ్చితంగా అమలు చేస్తోంది. ఈ నెల 15న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 6184 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 255 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశారని, 94 మందిని అరెస్టు చేశారని వివరించారు. ఎన్నికల నేపథ్యంలో 16,299 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయగా, 9070 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 808 సర్వే నిఘా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:33 AM