ఏపీ పిలుస్తోంది! 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 12 , 2026 | 05:37 AM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
రెండేళ్లలోపే 24 లక్షల ఉద్యోగాల సృష్టి.. 2047 నాటికి 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ
ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ కార్యాచరణ.. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీగా అమరావతి
విశాఖకు గూగుల్.. త్వరలో రిలయన్స్ కూడా.. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌కు రండి..
సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
‘‘ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ రూపంలో విశాఖకు వచ్చింది. ఆ సెంటరుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఇంగాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తికి రెన్యూ ఎనర్జీ సంస్థ సిద్ధమైంది. ఏపీలో మొదటిసారి విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించాం. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం.’’
- సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో సీఎం మాట్లాడారు. గడచిన 22 నెలల్లో రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలను తీసుకురాగలిగామన్నారు. భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా 160 గిగావాట్లను ఏపీలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో భారతదేశంలో పురోగతి నిరాఘాటంగా, ఎవరూ అడ్డుకోని విధంగా సాగుతోంది. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారు. ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోడానికి మోదీ హైదరాబాద్ లో సూచించిన కీలక చర్యలను అందరూ పాటించాలి. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం, పబ్లిక్ రవాణాను ఉపయోగించడం, ఇంటినుంచే పనిచేసే సంస్కృతిని అవలంబించడం, ఎరువుల వినియోగం తగ్గించడం వంటి చర్యల్ని మోదీ సూచించారు. విదేశీ నిల్వలను పటిష్ఠం చేసే ఆ సూచనలకు, ఆయన మిషన్‌కు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలి. దీనివల్ల వనరులను కాపాడుకోవడమేగాక, స్వయం సమృద్ధిని సాధించగలం. మోదీ నేతృత్వంలో దేశం అగ్రస్థానానికి చేరుకోవడం, అంతర్జాతీయ శక్తిగా మారడం ఖాయం. ప్రతి సవాలునూ అవకాశంగా మార్చుకోవడమే ధ్యేయం. పరిశ్రమలు తమ విద్యుత్ ను తామే ఉత్పత్తి చేసుకోవాలి. ప్రతి కుటుంబం, ప్రతివారు బయటి వనరులపై ఇంధనం కోసం ఆధారపడడం తగ్గించాలి. యుద్ధంలో నేరుగా పాల్గొననివారు కూడా, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.’’ అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

సీఐఐతో సుదీర్ఘ బంధం..
‘‘సీఐఐతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. సీఐఐ సహకారంతో నేను పెట్టుబడులను ఆకర్షించాను. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ఎజెండా. పరిజ్ఞానం, టెక్నాలజీ, వేగం అనే అంశాలపైనే ప్రపంచ పోటీ నడుస్తోంది. క్వాంటం, ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటలిజెంట్ లాజిస్టిక్స్ రంగాలను అందిపుచ్చుకునేలా పనిచేస్తున్నాం. టెలికమ్ డీ రెగ్యులేషన్, ఓపెన్ స్కై విధానం, విద్యుత్ సంస్కరణలు, రహదారులు తదితర రంగాల్లో జరిగిన విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది.’’
మన అవసరాలు ఇవీ..
‘‘దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో కూడా మంచి ఫలితాలు లభించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో గత కొంతకాలంగా అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, ఇథనాల్, ఈవీ, వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు ప్రస్తుతం మనకు అవసరం. మైక్రో గ్రిడ్ వ్యవస్థల ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. నేను 1990వ దశకంలో విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి చెప్పుకొదగ్గ ఫలితాలు సాధించాను. అయితే దాని వల్ల రాజకీయంగా నష్టపోయి 2004లో ఓడిపోయాను.’’ అని చంద్రబాబు వివరించారు.
కలిసి నడిస్తేనే భవిష్యత్తు..
‘‘భవిష్యత్ అవసరాల కోసం విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి కృషి చేయాలి. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను విద్యాసంస్థలు అందించాలి. ప్ర భుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తే, విద్యారంగం మానవ వనరులను అందిస్తుంది. ఉపాధికి అర్హత అనేది జాతీయ మిషన్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన, స్కిల్లింగ్, స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్, గవర్నెన్స్, ఇన్నొవేషన్ లాంటి సమీకృత విధానాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.