రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ.. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు : సీఎం
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:31 AM
ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి....
పేదల కంట్లో సంతోషమే నా సంకల్పం : సీఎం చంద్రబాబు
కూటమి వచ్చాక రెండోసారి ఇళ్ల పంపిణీ
రెండు విడతల్లో కలిపి ఐదు లక్షల పైనే..
జగన్ ఐదేళ్లలో ఇచ్చింది 6 లక్షల ఇళ్లే
పేదలకు గూడు కాదు.. గోడు మిగిల్చారు
విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నోళ్లు పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారా?
అందుకే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు
అప్పులు గాడిలో పెట్టాం..అభివృద్ధి వైపు ఏపీ
నాయుడుపేటలోని పుదూరు వద్ద టిడ్కో ఇళ్ల
ప్రారంభోత్సవంలో చంద్రబాబు వెల్లడి
తిరుపతి/నాయుడుపేట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆనాడు మీనమేషాలు లెక్కించాడంటూ మాజీ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరు వద్ద టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇళ్ల తాళాలు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో సొంతిళ్లలోకి అడుగు పెడుతున్న 15,659 మంది పేదల కళ్లలో ఆనందం చూడటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏపీ టిడ్కో ద్వారా ఒక లక్ష ఇళ్లు, హౌసింగ్ కింద 1.50 లక్షలు నిర్మించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ‘‘2014-19 మధ్య 8,19,853 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక, గత 21 నెలల్లో పేదలకు ఇళ్ల పంపిణీ ఇది రెండోసారి. గత ఏడాది నవంబరులో మూడు లక్షల మందికి ఇళ్లు అందించాం. ఇప్పుడు 2.50 లక్షల మంది ఒక్కరోజే గృహ ప్రవేశాలు చేశారు. ఇది ఓ చరిత్ర. 2029 నాటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరినీ సొంతింటివారిని చేసే బాధ్యత నాది’’ అని ఆయన వెల్లడించారు.
వైసీపీ ఐదేళ్ల కాలంలో కేవలం 6.55 లక్షల ఇళ్లు కట్టగా, రెండేళ్ల లోపే 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. డిసెంబరు నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను నిర్మించి పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ 4.73 లక్షల ఇళ్లు రద్దు చేశారు. 2.73 లక్షల మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వకుండా రూ.920 కోట్లు ఎగ్గొట్టారు. నేను ప్రారంభించాను కాబట్టి వాటిని విధ్వంసం చేయాలని వారు భావించారు’’ అని దుయ్యబట్టారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఏప్రిల్ నుంచి తనిఖీలు
2029కి అందరికీ ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇచ్చే ఇళ్లు కాకుండా మరో 17.60 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో జూన్ నాటికి 2.70 లక్షలు, సెప్టెంబరు నాటికి 1.62 లక్షల ఇళ్లు పూర్తిచేస్తాం. ఇంకా 12 లక్షలు ఉంటాయి. అవి కూడా కట్టించే బాధ్యత నాది. ఇంటి జాగాలేని వారికి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణంలో 3సెంట్ల చొప్పున ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించి ఇస్తాం. అధికారుల తీరును తెలుసుకునేందుకు ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా తనిఖీలు చేపడతా. తాగునీటిని కుళాయి ద్వారా అందించే కేంద్ర పథకాన్ని ఆనాడు అస్తవ్యస్తం చేశారు. ఈ పథకం కోసం రూ.28వేల కోట్లు కేంద్రం మంజూరు చేయగా, 2 వేల కోట్లే ఖర్చు చేశారు. కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకు పొడిగించేలా చూశాం. ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుదుత్పత్తి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెళ్లు పెట్టుకోవాలి. ఫైబర్‌నెట్ ప్రతి ఇంటికీ అందించాను. దీనిద్వారా వైఫై వచ్చేది. దాన్నీ నాశనం చేశారు. మళ్లీ కేంద్రంతో మాట్లాడి డబ్బు మంజూరు చేయించాను. త్వరలోనే ఇదీ పూర్తవుతుంది.’’
చట్టసభల్లోకి ఆడబిడ్డలు..
‘‘రాబోయే రోజుల్లో మగవాళ్లతో సమానంగా ఆడబిడ్డలు చట్టసభల్లోకి వస్తారు. ప్రతి ఇద్దరిలో ఒక ఆడబిడ్డ చట్టసభల్లో ఉంటుంది. తిరుపతి జిల్లాలో ఏడుగురిలో ఇద్దరు ముగ్గురు ఆడబిడ్డలకు చాన్స్ ఉంటుంది. ప్రజా సేవపై ఆసక్తి కలిగిన మహిళలకు స్వాగతం పలుకుతున్నాం. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం చేస్తాం. రాజఽధానిపై మూడు ముక్కలాట ఆడారు. శాశ్వత పరిష్కారం కోసం అమరావతే రాజధాని అని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. త్వరలోనే చట్టం వస్తుంది. అమరావతిని హైదరాబాద్, చెన్నై కంటే కూడా నంబరు వన్‌గా తయారు చేస్తాం.’’
మొదటి తేదీనే..
‘‘పేదలకు మొదటి తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. ఇక్కడున్న ముస్లిం మహిళను అడిగితే తన ముగ్గురు బిడ్డలకూ ‘తల్లికి వందనం’ వస్తోందని తెలిపారు. ఈ ఏడాది డ్వాక్రా సంఘాల్లోని 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడం నా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం నూటికి నూరుశాతం జీతాలకే సరిపోతోంది. కేంద్రం ఇచ్చే గ్రాంటు, వాటా అప్పులకు సరిపోతాయి. సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తోంది. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. దీన్ని సరిచేయాలి. నాడు 13 నుంచి 14 శాతానికి వడ్డీకి తీసుకొచ్చారు. నేను వచ్చాక వడ్డీలు తగ్గించాం. ఎన్నిమార్గాలు వెతికినా, బరువు ఎక్కువగానే ఉంది. అయినా ఓటమిని ఒప్పుకోను. రాష్ట్రాన్ని బాగుచేసి.. మీ రుణం తీర్చుకుంటా.’’
వేంకటేశ్వరస్వామికి అపచారం...
‘‘ఒకప్పుడు తీవ్రవాదులు అడవుల్లో ఉండేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరింది. నాపై 2003లో 23 క్లెమోర్‌మైన్లు పేల్చినా వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారు. అలాంటి స్వామిని అప్రతిష్ఠపాలు చేయాలని, అపచారం చేయాలని కల్తీ నెయ్యి వ్యవహారాలను గత ప్రభుత్వంలో సాగించారు. అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు.రాజకీయాల్లో 48 ఏళ్లు ఉన్నాను. 2028 నాటికి 50 ఏళ్లు. ఇన్నాళ్లలో నేనెప్పుడూ తప్పు చేయలేదు. అలాంటి నన్ను జైల్లో పెట్టారంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఆనాడు ఎలా ఉండేదో ఊహించుకోండి.
పేదల సొమ్మునూ నాడు వదల్లేదు
‘‘గత ప్రభుత్వంలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సొమ్మును ఇతర, సొంత అవసరాలకు మళ్లించారు. 25 శాతం కంటే తక్కువ నిర్మాణం జరిగిందంటూ.. లబ్ధిదారుల సంఖ్యను 2.61 లక్షల నుంచి 1.20 లక్షలకు కుదించారు. లబ్ధిదారులు కట్టిన రూ.174 కోట్లను తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ విషయం మంత్రి నా దృష్టికి తీసుకురాగానే, ఆ సొమ్మును 82 వేలమందికి అకౌంట్‌లో వేయాలని ఆదేశించా. కాంట్రాక్టరు బిల్లులు రూ.816 కోట్లు అప్పు పెట్టారు. దీంతో వారు పని నిలిపివేశారు. ఈ రోజు ఆ భారంగా అదనంగా రూ.3,109 కోట్లు అయింది. ఆ రోజు ఖర్చు చేసి ఉంటే ఇంత భారం పడేది కాదు. మరోపక్క రూ.12,173 కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇస్తే అందులో రూ.2,913 కోట్లు మళ్లించారు. కేంద్రం రూ.28 కోట్లు జరిమానం విధించినా...నాటి ప్రభుత్వానికి సిగ్గు రాలేదు’’
నా కంటే ముందు స్టేజ్ పైకి జేసీని పిలుస్తారా?
మంత్రి ఎదుటే అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. మరోసారి వివాదంలో కడప ఎమ్మెల్యే మాధవి
కడప, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్.మాధవి మరోసారి వివాదంలోకి ఎక్కారు. కడప లక్ష్మీనగర్‌లో సోమవారం జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత హాజరయ్యారు. నిర్వాహకులు తొలుత వేదికపైకి మంత్రిని ఆహ్వానించారు. అనంతరం జేసీ నిధిమీనాను, ఆ తర్వాత ఎమ్మెల్యేను పిలిచారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి తర్వాత తనను పిలవకుండా జేసీని పిలవడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోయారు. మంత్రి ఎదుటనే హౌసింగ్, కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ వివాదం రేగడంతో కార్యక్రమం మొదలైన ఐదు నిమిషాలకే జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.