Share News

ఉక్కు.. తుక్కు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:40 AM

పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్‌ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు.

ఉక్కు.. తుక్కు!

  • జగన్‌ హయాంలో అడ్డగోలుగా దోపిడీ

  • రూ.100 కోట్ల విలువైన 16 వేల టన్నుల స్టీల్‌కు తుప్పు

  • పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు

  • మార్కెట్‌ కంటే అధిక ధరకు స్టీల్‌ కొనుగోలు

  • 2022లో 1,91,812 టన్నుల సేకరణ

  • కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైనం

  • 350 కోట్ల ఇతర మెటీరియలూ ఎక్కువ రేట్లకు

  • కంపెనీల నుంచి అధికారులకు కమీషన్లు

  • విజిలెన్స్‌ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి

  • ఆ మెటీరియల్‌ కూడా చాలావరకు పక్కదారి

  • మిగిలి ఉన్నదీ వినియోగించలేని దుస్థితి

మార్కెట్లో వెయ్యి రూపాయల విలువ చేసే ఓ వస్తువును టోకున భారీ స్థాయిలో వేలు, లక్షల సంఖ్యలో కొనుగోలు చేశామనుకుందాం..! సాధారణంగా ఏ కంపెనీలు అయినా ధర తగ్గిస్తాయి. దేశంలో ఎక్కడికెళ్లినా ఇంతే. జగన్‌ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఏకంగా 1,91,812 టన్నుల స్టీల్‌ కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కొన్నందుకు మార్కెట్‌ ధర కంటే తక్కువ రేటుకు రావాలి కదా..! కానీ మార్కెట్‌ రేటు కంటే అదనంగా రూ.10.28 కోట్లు చెల్లించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీల నుంచి భారీ మొత్తాల్లో కమీషన్లు దండుకున్నారు. నాడు పేదల ఇళ్ల నిర్మాణం పేరిట చేసిన మోసం విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూసింది.

స్టీల్‌ మాత్రమే కాదు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 11 రకాల ఇతర మెటీరియల్‌నూ అధిక ధరలకు కొనుగోలు చేశారు. సెంటు జాగాలో కట్టే ఒక్కో చిన్న ఇంటికి రూ.1.12 లక్షల విలువ జేసే వస్తువులు కొన్నారు. దాదాపు రూ.350 కోట్లు వెచ్చించి నాసిరకం వస్తువులు సేకరించి జిల్లాల్లోని గోడౌన్లలో పడేశారు. వీటిని కూడా చాలావరకు క్షేత్రస్థాయి అధికారులు పక్కదారి పట్టించారు. మిగిలి ఉన్న మెటీరియల్‌లో కనీసం వంద కోట్ల విలువైన 16 వేల టన్నుల స్టీల్‌ తుప్పుపట్టింది. ఇతర మెటీరియలూ వినియోగించలేని దుస్థితి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్‌ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు. చివరకు స్టీల్‌, ఇతర మెటీరియల్‌ కొనుగోళ్లలోనూ కమీషన్లు. నాడు వైసీపీ నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కుమ్మక్కై అడుగడుగునా, అడ్డగోలుగా సాగించిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్టీల్‌, ఇతర మెటీరియల్‌ కొనుగోళ్లలో మార్కెట్‌ ధర కంటే ఎక్కువ చెల్లించి కమీషన్లు దండుకున్నట్టు విజిలెన్స్‌ విచారణలో బయటపడింది. 2022లో స్టీల్‌ కొనుగోలుకు సంబంధించి కంపెనీలకు మార్కెట్‌ ధరకు మించి రూ.10.28 కోట్లు దోచిపెట్టినట్టు వెల్లడైంది. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ‘సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌’ విధానంలో భారీగా సేకరించిన సిమెంటు కొనుగోలులో నాటి సీఎం జగన్‌ సొంత కంపెనీ ‘భారతి సిమెంట్స్‌’కు లబ్ధి చేకూర్చిన సంగతి తెలిసిందే. అర్హతకు మించి మూడు రెట్లు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి దాదాపు రూ.165 కోట్లు చెల్లించిన విషయం విజిలెన్స్‌ విచారణలో తేలింది. అదే తరహాలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా భారీస్థాయిలో సేకరించిన స్టీల్‌, ఇతర మెటీరియల్స్‌ కొనుగోలు వ్యవహారంలోనూ జరిగిన భారీ అవినీతి తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ డబ్బులతో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌ ఆ పేదలను మోసం చేశారు.

కమీషన్ల కక్కుర్తితో..

రాష్ట్రంలో పేదలకు పక్కా గృహాలు నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఆ డబ్బులతో లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు. కానీ ఈ మొత్తంతో ఇళ్లు కట్టుకోలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే మూడో ఆప్షన్‌ కింద నిర్మించి ఇస్తుందని గత ప్రభుత్వంలో జగన్‌ గొప్పలు చెప్పారు. ఆయన మాటలను నమ్మి రాష్ట్రవ్యాప్తంగా 3.51 లక్షల మంది ఆప్షన్‌-3ని ఎంపిక చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.వేల కోట్ల నిధులను కొట్టేసేందుకు వైసీపీ పెద్దలు కుట్ర పన్నారు. ఆప్షన్‌-3 ఇళ్లను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా కట్టించకుండా సొంత మనుషులకే కాంట్రాక్టులు ఇప్పించారు. కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయలను ఎడాపెడా లూఠీ చేసేశారు. నిర్మాణాలు చేయకముందే బిల్లులు చెల్లించారు. లబ్ధిదారులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణ కోసం స్టీలు, ఇతర మెటీరియల్‌ కొనుగోలు చేశారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా లక్షలాది టన్నుల ఇనుము (స్టీలు), ఇతర గృహోపకరణాల సామగ్రి (అదర్‌ మెటీరియల్స్‌) వివిధ కంపెనీల ద్వారా కొన్నారు. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే పేదల ఇళ్లకు స్టీల్‌ను సరఫరా చేయడం కోసం సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అనుసరించినట్లు పైకి చెప్పారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువ ధరలకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు స్టీల్‌ కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులను దోచిపెట్టారు. ఆయా కంపెనీల నుంచి భారీ మొత్తాల్లో కమీషన్లు దండుకున్నారు. 2022లో రెండో దశ (సెకండ్‌ స్పెల్‌)లో 12 కంపెనీల నుంచి మొత్తం 1,91,812 టన్నుల స్టీల్‌ కొనుగోలు చేసి రూ.1300 కోట్ల బిల్లులు చెల్లించారు. మార్కెట్‌ రేట్ల కంటే ఏకంగా రూ.10.28 కోట్లు అదనంగా చెల్లించినట్లు విజిలెన్స్‌ నిగ్గు తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొంది.


ఇతర మెటీరియల్‌ కొనుగోలులోనూ అవినీతి

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌, స్టీల్‌తో పాటు ఇనుప వాకిళ్లు, తలుపులు, విండో ఫ్రేమ్‌లు, శానిటరీ, ఎలక్ట్రికల్‌ పరికరాలు, రంగులు, వాటర్‌ ట్యాంకులు తదితర నిర్మాణ సామగ్రి కొనుగోలులోనూ భారీ అవినీతి జరిగింది. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే హౌసింగ్‌ అధికారులు మార్కెట్‌ రేటు కన్నా ఎక్కువ ధరలకు ఒకేసారి కొనుగోలు చేసేసి గోడౌన్లలో డంప్‌ చేసేశారు. కొన్ని జిల్లాల్లో హౌసింగ్‌ ఏఈలు, డీఈఈలు వద్దన్నా జిల్లాల హౌసింగ్‌ హెడ్స్‌ ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి వారి నుంచి బలవంతంగా రిక్వెస్ట్‌ లెటర్స్‌ తీసుకుని మరీ భారీస్థాయిలో నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేశారు. 2021 జవనరిలో స్టీల్‌తో సహా 13 రకాల నిర్మాణ సామగ్రి కొనుగోలుకు కాంట్రాక్టు సంస్థల నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. నిబంధనలను సవరించి మళ్లీ టెండర్లు పిలిచారు. అప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి 10 సంస్థలు ముందుకు వచ్చాయి. వాటికి టెండర్లు ఖరారు చేయడానికి ముందే ఆయా సంస్థల నుంచి అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు భారీ మొత్తాల్లో కమీషన్లు దండుకున్నారు. ఆయా కంపెనీల నుంచి ఒక్కో ఇంటికి రూ.లక్షకు పైగా విలువ చేసే సామగ్రిని ఒకేసారి రూ.350 కోట్లు పెట్టి కొన్నారు. అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని గోడౌన్లలోకి డంప్‌ చేసేశారు. మార్కెట్‌ రేట్ల కంటే ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన ఆ వస్తువులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి.


గోదాముల్లోని సిమెంట్‌, మెటీరియల్‌ మాయం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గోదాముల్లో, బయట నిల్వ చేసిన స్టీల్‌, ఇతర మెటీరియల్స్‌లో కాస్తో కూస్తో పనికొస్తాయనుకున్న సామగ్రిని క్షేత్రస్థాయిలోని హౌసింగ్‌ అధికారులే పక్కదారి పట్టించారు. అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆన్‌లైన్‌లో చూపిస్తున్న నిల్వలకు, ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసాన్ని విజిలెన్స్‌ గుర్తించింది. గోడౌన్లలో దింపిన సిమెంట్‌ స్టాకు రికార్డులను సరిగా నిర్వహించ లేదు. లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపుతున్న సిమెంటుకు స్టాక్‌ రిజిస్టర్లలో లబ్ధిదారుల అక్నాలెడ్జిమెంట్లు లేవు. వాటికి రసీదులు, వే బిల్లులు, కూపన్ల స్టాక్‌ ఫైల్స్‌ గోడౌన్ల ఇన్‌చార్జిల దగ్గర లేవు. హౌసింగ్‌ అధికారులు గోడౌన్ల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రూ.వందల కోట్ల మెటీరియల్‌ పనికి రాకుండా పోయింది.

తుప్పుపట్టిన 16 వేల టన్నుల స్టీల్‌

జగన్‌ హయాంలో సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో పెద్దఎత్తున కొనుగోలు చేసిన స్టీల్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలించారు. ఆ స్టీల్‌ను భద్రంగా దాచడానికి గోడౌన్లలో ఖాళీ లేకపోవడంతో దాదాపు అన్నిచోట్లా ఆరు బయటే వదిలేశారు. ఈ స్టీల్‌ భద్రత గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలావరకు పక్కదారి పట్టింది. మిగిలి ఉన్న స్టీల్‌ను పేదల ఇళ్లకు వినియోగించకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయింది. చివరికి పనికి రాకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 16 వేల టన్నులకు పైగా స్టీల్‌ ఎందుకూ పనికి రాకుండా పోయింది. దాని విలువ ఎంత తక్కువ వేసుకున్నా దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. తుప్పు పట్టి వినియోగానికి పనికిరాకుండా పోయిన ఈ స్టీల్‌ను ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సెంటు ఇల్లు.. 1.12 లక్షల సామగ్రి

ప్రభుత్వం ఒక సెంటు స్థలంలో నిర్మిం చే చిన్న ఇంటికి ఎలక్ట్రికల్‌ పరికరాలకే రూ.5,730, ఫ్లష్‌ డోర్‌ షట్టర్లకు రూ.6,920, జీఐ విండో ఫ్రేములకు రూ.7,276, ఎంఎస్‌ డోర్‌ ఫ్రేములకు రూ.2,982, ఎంఎస్‌ యాంగిల్‌ ఫ్రేములకు రూ.6,709, 200 లీటర్ల డబుల్‌ లేయర్‌ పీవీసీ వాటర్‌ ట్యాంక్‌కు రూ.3,090, పీవీసీ టాయిలెట్‌ డోర్‌ ఫ్రేములకు రూ.2,640లు వెచ్చించా రు. ఇలా ఒక్కో ఇంటికి మొత్తం రూ. 1,12,117 పెట్టి సామగ్రి కొనుగోలు చేశారు. ఆ నాసిరకపు నిర్మాణ సామగ్రి నాలుగేళ్లుగా గోడౌన్లలో పడి ఉండటంతో ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి.

Updated Date - Feb 16 , 2026 | 06:06 AM