జస్టిస్ జి.చంద్రయ్యకు హైకోర్టు ఘన నివాళి
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:43 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్యకు మంగళవారం హైకోర్టు ఘన నివాళులర్పించింది.
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్యకు మంగళవారం హైకోర్టు ఘన నివాళులర్పించింది. ఇటీవల మరణించిన తెలంగాణకు చెందిన జస్టిస్ చంద్రయ్యకు నివాళి అర్పించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ నేతృత్వంలో న్యాయమూర్తులంతా మంగళవారం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ లిసాగిల్ మాట్లాడుతూ.. జస్టిస్ చంద్రయ్య మానవ హక్కుల కోసం పరితపించారన్నారు. సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి అంశాలపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడుతూ.. జస్టిస్ చంద్రయ్య అందించిన న్యాయసేవలను గుర్తు చేశారు. అనంతరం జస్టిస్ చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని న్యాయమూర్తులు కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య కుటుంబ సభ్యులు, బార్ కౌన్సిల్ చైర్మన్ యలమంజుల బాలాజీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం