వరుస.. ఉద్యోగాలు!
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:23 AM
రాష్ట్రంలో నిరుద్యోగుల కలలు ఫలిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వడివడిగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులు సహా కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.
స్థానిక ఎన్నికల కోడ్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ, ఇతర పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగుల కలలు ఫలిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వడివడిగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులు సహా కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 10,060 ఉద్యోగాలతో ఈ ఏడాది ఆగస్టు 22న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం దాదాపు 70 శాతానికిపైగా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ.. ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే షార్ట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
2,721 టీచర్ ఉద్యోగాల భర్తీకి పాఠశాల విద్యాశాఖ, 1,466 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేశాయి. త్వరలోనే వీటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇక, పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభమైతే దాదాపుగా 100 శాతం జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు అవుతుంది.
యూనివర్సిటీలతో మొదలు
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్లను వచ్చాయి. 1,523 పోస్టులతో ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులను నేరుగా ఇంటర్వ్యూలతో భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరులో రాత పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆతర్వాత సెప్టెంబరు 16న 2,050 పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, ఇతర ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన చేసింది.
దీనిలో 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక, విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ విద్యుత్ ఇంజనీర్ పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేస్తున్నాయి. రాత పరీక్ష నిర్వహించిన విద్యుత్ సంస్థలు త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నాయి. కీలకమైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 166 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులతో సహా ఈసారి డీఈవో పోస్టులను గ్రూప్-1లో భర్తీ చేస్తున్నారు. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
మూడో దశలో..
జాబ్ క్యాలెండర్ మూడో దశలో 1,466 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఇటీవల 10 షార్ట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో గ్రూప్-2 ఉద్యోగాలు 686 ఉన్నాయి. వివిధ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 503 భర్తీ చేస్తున్నారు.చాలాకాలంగా ఖాళీగా ఉన్న డైట్ లెక్చరర్ పోస్టులు కూడా ఈ దఫా భర్తీ కానున్నాయి. ఇవి కాకుండా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఏడీ పోస్టులు, మత్య్సశాఖలో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, కాలుష్య నియంత్రణ మండలిలో గ్రేడ్-2 ఎనలిస్ట్ ఉద్యోగాలు, అసెంబ్లీలో రిపోర్టర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది.
ఎక్సైజ్ కానిస్టేబుళ్లు 400
స్థానిక ఎన్నికల అనంతరం 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 1,156 పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ కూడా చేపడితే 100 శాతం భర్తీ ప్రారంభించినట్లు అవుతుంది. మొత్తం పూర్తయితే ఏడాదిలో దాదాపు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుంది.
వైసీపీ వంచన
మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అనే ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. నిరుద్యోగులనఉ నిండా మోసం చేసింది. 2021లో 10,143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా దానిని కాగితాలకే పరిమితం చేసింది. క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాలేవీ భర్తీ చేయలేదు. ఇక, 23వేల టీచర్ ఉద్యోగాలతో ‘మెగా డీఎస్సీ’ అని చెప్పి ఎన్నికలకు ముందు 6100 ఉద్యోగాలతో డీఎస్సీ ప్రకటించింది. అది కూడా అమలు చేయలేదు. ఏపీపీఎస్సీ ద్వారా 5 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. సచివాలయాల ఉద్యోగాలు మినహా కీలక ఉద్యోగాల భర్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
ఈ వార్తలనూ చదవండి: