Share News

సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:37 AM

తమకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) స్థానంలో పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్‌) అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది.

సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు

  • మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

  • 2004 సెప్టెంబరు 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్లకు వర్తింపు

  • దీర్ఘకాల డిమాండ్‌కు సర్కారు పరిష్కారం

  • ఆప్షన్లకు డిసెంబరు 31 వరకు గడువు

  • రిటైర్డ్‌, సర్వీసు ఉద్యోగులకు ఒకేసారి చాన్స్‌

  • నిధి పోర్టల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు

  • సంబరాలు చేసుకున్న సర్కారు ఉద్యోగులు

  • ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: సంఘాలు

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తమకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) స్థానంలో పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్‌) అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. సీపీఎస్‌ పరిధిలోని అర్హులైన ఉద్యోగులు.. ఓపీఎస్‌ ఎంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన ఉద్యోగులు, రిటైర్డ్‌ సిబ్బంది, ఫ్యామిలీ పెన్షన్‌ లబ్ధిదారులు ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిధి పోర్టల్‌ ద్వారా ఉద్యోగులు తమ ఆప్షన్లను ఎంచుకోవాలని పేర్కొంది. ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రత, స్థిరమైన నెలవారీ ఆదాయం, కుటుంబ పెన్షన్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అర్హులైన సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించింది. కాగా, ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌/ప్రకటన సెప్టెంబరు 1, 2004 కంటే ముందే విడుదలై ఉండి, వాటి ద్వారా నియమితులైన ఉద్యోగులు ఓపీఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అలానే, సెప్టెంబరు 1, 2004 లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం సీపీఎస్‌ కింద కొనసాగుతున్న ఉద్యోగులు ఓపీఎస్‌కు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపట్ట ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన కానుకని పలువురు సంతోషం వ్యక్తం చేయగా సంఘాల నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.’’ అని పేర్కొన్నారు.


దరఖాస్తు ప్రక్రియ ఇలా..

దరఖాస్తులను నిధి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. పోర్టల్‌లో దీని కోసం ‘సీపీఎస్‌-ఓపీఎస్‌ కన్వర్షన్‌’ అనే ఆప్షన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సేవల్లో ఉన్న ఉద్యోగులు తమ ప్రస్తుత నిధి లాగిన్‌ వివరాలను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వీసులో లేని వారు, రిటైర్‌ అయిన వారు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు, సాంకేతికంగా రాజీనామా చేసిన వారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు నిధి యాప్‌లో కొత్తగా నమోదు చేసుకుని, కొత్త ఐడీ క్రియేట్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుదారులు తాము మొదట నియమితులైన శాఖకు సంబంధించిన నియామక అధికారిని సంప్రదించి, నియామక నోటిఫికేషన్‌, సెలక్షన్‌ లిస్టు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌, డ్యూటీ జాయినింగ్‌ ఆర్డర్ల సర్టిఫైడ్‌ కాపీలను పొందాలి. దరఖాస్తు అందిన 15 పనిదినాల్లో నియామక అధికారి ఈ కాపీలను దరఖాస్తుదారునికి అందించాల్సి ఉంటుంది. సర్టిఫైడ్‌ కాపీలు అందిన తర్వాత, ఉద్యోగి ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైరైన వారైతే చివరిగా పనిచేసిన కార్యాలయ డీడీవోకి నిధి పోర్టల్‌ ద్వారా వీటిని అప్‌లోడ్‌ చేసి పంపాలి. డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు నేరుగా ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయవచ్చు. డీడీవో ఈ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా తొలినియామక అధికారికి పంపుతారు.

సదరు అధికారి ఆ పత్రాలను పరిశీలించి, 7 రోజుల్లోగా వాటి ప్రామాణికతను నిధి పోర్టల్‌లో ధ్రువీకరిస్తారు. ఒకవేళ పత్రాలు సరైనవి కాకపోతే సవరణ కోసం దరఖాస్తుదారునికి తిప్పి పంపుతారు. డీడీవో సదరు దరఖాస్తును ఉద్యోగి సర్వీస్‌ రిజిస్టర్‌తో సరిపోల్చి, 10 పనిదినాల్లోగా తన సిఫారసులతో కూడిన ప్రతిపాదనను పైఅధికారులకు ఆన్‌లైన్‌లో పంపుతారు.


ఇలా చేస్తే.. ఇబ్బందే!

సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారే విధానం కేవలం ఒకసారి మాత్రమే కల్పించిన అవకాశం(వన్‌ టైమ్‌ ఆప్షన్‌). జీవోలో పేర్కొన్న విధంగా ఈ ఏడాది డిసెంబరు 31లోపు సరైన పత్రాలతో నిధి పోర్టల్‌లో దరఖాస్తు చేయకపోయినా.. అప్‌లోడ్‌ చేసిన పత్రాలు తిరస్కరణకు గురైనా.. గడువులోగా సవరించుకోకపోయినా సదరు ఉద్యోగులు లేదా రిటైర్డ్‌ ఉద్యోగులు ఎప్పటికీ సీపీఎస్‌లో ఉండిపోవాల్సి వస్తుంది.

  • ఇదే నిజమైన దీపావళి!

ఓపీఎస్‌ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాల హర్షం

సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ పరిధిలోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయడంపై ఏపీ ఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌, డీవీ రమణ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు(అప్సా) గొలిమి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీశ్‌ చింతగుంట్ల మరియదాస్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోమవారం ప్రకటనలు విడుదల చేశారు. ఉద్యోగుల చిరకాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందని అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ రోజే అసలైన దీపావళి అని పేర్కొన్నారు.

ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆర్థిక మంత్రి కేశవ్‌లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని గొలిమి రామకృష్ణ అన్నారు. కాగా, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘం, గ్రూప్‌-1, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు రాష్ట్ర సచివాలయంలో విద్యాసాగర్‌, డీవీ రమణలను సత్కరించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 03:40 AM