30న తుది ఓటర్ల జాబితా విడుదల
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:15 AM
రాష్ట్రంలో ఈనెల 30న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు వివరాలు వెల్లడించారు.
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 30న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు వివరాలు వెల్లడించారు. అలాగే తుది జాబితా రూపకల్పన,ముద్రణ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబరు 30న ఉదయం 11 గంటలకల్లా తుది ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అదేరోజు పార్టీలతో సమావేశం నిర్వహించి ఆ జాబితాను అందజేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. 22వ తేదీ అర్ధరాత్రికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా ఈసీఐ నెట్‌లో ఓటరు జాబితాను ఫ్రీజింగ్ చేస్తారు.
24 ఉదయం 11 గంటల్లోగా ఈఆర్‌వోల ద్వారా నమూనా (బీటా) ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. 25వ తేదీలోగా ఈఆర్‌వోలు, జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో) ద్వారా తుది ఓటరు జాబితాను ఖరారు చేస్తారు. 25న డీఈవోలనుంచి బీటారోల్ ధ్రువీకరణ పత్రాలు అందిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం న మూనా(బీటా రోల్) ఓటరు జాబితాపై గుర్తును తొలగిస్తుంది. 26న ఓటరు జాబితా పీడీఎఫ్ ప్రతిని ముద్రణ సంస్థకు అందజేస్తారు. 29న మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలకు ముద్రించిన ఓటరు జాబితాలను అందజేస్తారు. 30న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అదేరోజు ఎన్నికల సంఘం అధికారులు పార్టీలతో సమావేశమై తుది జాబితాలను అందజేస్తారు.
ఈ వార్తలనూ చదవండి: