Share News

తుఫాన్‌ వేగం 140కి.మీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:29 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయానికే తీవ్ర అల్పపీడనంగా... రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నది. సోమవారం ఉదయానికి తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది.

తుఫాన్‌ వేగం 140కి.మీ

  • వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం..

  • రేపటికల్లా తుఫాన్‌గా మార్పు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయానికే తీవ్ర అల్పపీడనంగా... రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నది. సోమవారం ఉదయానికి తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి 28వ తేదీ ఉదయానికి ఉత్తర కోస్తా తీరానికి వస్తుంది. అదేరోజు మధ్యాహ్నం విశాఖ-బాపట్ల మధ్య (కాకినాడ- బందరు) మధ్య తీరం దాటుతుంది. సోమవారం ఉదయం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 90-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆదివారం నుంచి సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లొద్దని, లోపల ఉన్నవారంతా వెంటనే తీరానికి రావాలని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

వాయుగుండం శనివారం సాయంత్రానికి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పుగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో తుఫాను విశాఖపట్నం-బాపట్ల (కాకినాడ-బందరు) మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ శనివారం రాత్రి తెలిపింది. అతి తీవ్ర తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాలు ఎక్కువగా ప్రభావానికి గురవుతాయని ఇస్రో వాతావరణ నిపుణుడు స్పష్టం చేశారు.


సింహాద్రిపురంలో 83 మి.మీ.

తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లా సింహాద్రిపురంలో 83 అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న 48గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రేపటి నుంచి వర్షాలు

కోస్తాంధ్రలో సోమవారం నుంచి వర్షాలు పెరుగుతాయి. 27న కృష్ణాలో కుంభవృష్టి, తూర్పు, పశ్చిమ, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో అతిభారీ, కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 28న విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అతిభారీ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

తుఫాన్‌పై ముందస్తు సూచనలు ఇవ్వండి: సీఎం

తుఫాన్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి, నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో శనివారం సీఎస్‌ సాయిప్రసాద్‌, ఆర్టీజీఎస్‌ అధికారులతో సీఎం సమీక్షించారు. తుఫాన్‌ బలపడి, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో తుఫాన్‌ కదలికలు, ప్రభావం, తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు, సూచనలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ జాగ్రత్తలు తీసుకోండి

తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ప్రజలు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ సూచించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

  • మొబైల్‌ ఫోన్లకు చార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలి.

  • ఐఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌ పంపే వాతావరణ సమాచారాన్ని గమనించాలి.

  • విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్‌ప్రూఫ్‌ కవర్లలో భద్రపర్చుకోవాలి.

  • కనీసం వారానికి సరిపడా నిత్యావసర సరుకులు నిల్వ చేసుకోవాలి.

  • ఇంటి పైకప్పు సరిచేసుకోవాలి. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.

  • ఇంట్లో ఎలక్ర్టికల్‌ వస్తువులను స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

  • గ్యాస్‌ కనెక్షన్‌ తొలగించాలి.

  • ఇల్లు సురక్షితం కాదని భావిస్తే.. సమీప పునరావాస కేంద్రానికి వెళ్లాలి.

  • అధికారులు చెప్పేవరకు పునరావాస కేంద్రం నుంచి వెళ్లకూడదు.

  • కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి.

  • విద్యుత్‌ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల కింద ఉండరాదు.

  • తెగిపడిన విద్యుత్‌ వైర్లను తాకకూడదు. విరిగిన స్తంభాలను కదపరాదు.

  • నీటిలో తడిసిన విద్యుత్‌ వైర్లు, పరికరాలను తాకకూడదు.

  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. వెళ్లిన వారు వెనక్కి రావాలి. పడవలు, తెప్పలను బలమైన తాడుతో కట్టి ఉంచాలి.

  • అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:31 AM