Share News

రైతులందర్నీ ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:28 AM

అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. చివరి బాధితుడి వరకు సాయం అందిస్తామని ప్రకటించారు.

రైతులందర్నీ ఆదుకుంటాం

  • చివరి బాధితుడి వరకు ప్రభుత్వ సాయం

  • ‘అర్నబ్‌’ను ముందే అంచనా వేశాం

  • ప్రాణ నష్టం చాలావరకు నివారించాం

  • వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ 25 వేలిస్తాం.. మిగతా పంటల నష్టానికీ పరిహారం

  • అధికార యంత్రాంగం పనితీరు భేష్‌.. సహాయక చర్యలపై జనంలో సంతృప్తి

  • నేను, పవన్‌, బీజేపీ కోరుకునేది ఇదే.. పశ్చిమలో సీఎం పర్యటన

  • రైతులతో కలిసి దెబ్బతిన్న పొలాల చెంతకు చంద్రబాబు

  • రూ.4,600 కోట్ల నష్టం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక

అమరావతి, భీమవరం, మొగల్తూరు, నరసాపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. చివరి బాధితుడి వరకు సాయం అందిస్తామని ప్రకటించారు. అర్నబ్‌ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా చేరుకుని, బాధితులతో మాట్లాడారు. మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్‌లో నాలుగు రోజులుగా ఉంటున్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బియ్యం, కందిపప్పు, వంటనూనె, బంగాళాదుంపలు తదితర నిత్యావసరాలను పంపిణీ చేశారు. నరసాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన పంట పొలాలను, దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో తుఫాను వల్ల ప్రాథమికంగా 4600 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్ర మంత్రి అమిత్‌షాతో మాట్లాడాను. ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. కానీ కమ్యూనికేషన్‌ విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రైవేటు ఆపరేటర్ల టవర్లకు విద్యుత్‌ సరఫరా లేకపోవటంతో సిగ్నళ్లు నిలిచిపోయాయి. జనరేటర్లతో కమ్యూనికేషన్‌ పునరుద్దరించేలా దృష్టిపెట్టాం.’’ అని చంద్రబాబు వివరించారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని తెలిపారు. మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


తుఫాన్‌ విధ్వంసం కళ్లారా చూశా..

‘‘స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ, తుఫాను సహాయక చర్యలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాను. క్షేత్రస్ధాయిలో అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూశా. సాంకేతికతను ఉపయోగించి తుఫాన్‌ ప్రభావంతో జరిగే నష్టాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌లకు వివరిస్తూనే ఉన్నా. తుఫాన్‌ తీరందాటే సమయంలో రాత్రి నిద్ర పోకుండా సమీక్షించాం. తుఫాన్‌ ఏ గమ్యం నుంచి పయనిస్తోందంటూ ముందుగానే తెలుసుకున్నాం. చెట్లు కూలిపోయే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేశాం. అర్నబ్‌ తుఫాన్లు వంటి విపత్తులు వస్తాయని తెలుసుకుని బీమా చెయ్యాలంటూ రైతులకు అవకాశం కల్పించాం. అనేక మంది బీమా చేయించుకున్నారు. ఎకరానికి రూ.35 వేలు బీమా చేసుకోవటం వల్ల బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి హెక్టార్‌కు రూ.25 వేలు అంటే, ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం. ఒక వైపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మరోపక్క ప్రభుత్వ సాయంతో రైతు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.’’

24 గంటల్లో విద్యుత్‌ సరఫరా

‘‘తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో 15 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 12 వేల చెట్లు నేలకు ఒరిగాయి. చెట్ల వ్యర్థాలను తర్వలోనే తొలగిస్తాం. ముందుగా అంచనా వేసుకోవటం వల్లే, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాం. కేంద్ర బృందం పర్యటించిన తర్వాత చెట్ల వ్యర్థాలను తొలగిస్తాం. స్తంభాలు కూలిపోవటంతో విద్యుత్‌ సమస్య తలెత్తింది. సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ నుంచి విద్యుత్‌ సిబ్బందిని రప్పిస్తున్నాం. 24 గంటల్లోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తాం. ఆ తరువాత వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాపై చర్యలు తీసుకుంటాం. తుఫాన్‌ వల్ల నష్టపోయిన మత్య్సకారులను, రైతులను ఆదుకుంటాం. తుఫాన్‌ తీవ్రతను అంచనా వెయ్యటంతోనే ఎన్ని విద్యుత్‌ స్తంభాలు దెబ్బతింటాయో, చెట్లు ఎన్ని పడిపోతాయో అంచనాకు వచ్చాం. పంట నష్టాన్ని ముందుగానే అంచనా వేయగలిగాం. ఇప్పుడు రైతులను ఆదుకునే పనిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.’’


పరిహరం ఎంత ఇవ్వాలో తేల్చేశాం

‘వరి రైతుకు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తాం. మత్స్యకారులబోటు, వలలు దెబ్బ తింటే రూ.25 వేలు అందిస్తాం. ఆవులు, గేదెలు, మరణిస్తే రూ.40 వేలు, చిన్న దూడలు మరణిస్తే రూ.25 వేలు, మేక లు, గొర్రెలు మరణిస్తే రూ.7,500 చొప్పున పరిహారం ఇస్తాం. ఫౌల్ట్రీ చనిపోయిన కోళ్లకు సాయం అందిస్తాం. పత్తి, వేరుశనగ, చెరుకు వంటి పంటలకు రూ.25 వేలు, కందులు, పెసలు, జనుము, పొగాకు, సన్‌ఫ్లవర్‌, సోయాబిన్‌ వంటి పంటలకు హెక్టార్‌కు రూ.15 వేలు అందించాలని నిర్ణయించాం. ఉద్యాన పంటల్లో అరటి, పసుపు పంటకు రూ.35 వేలు, కూరగాయలు దెబ్బ తింటే రూ.25 వేలు, తమలపాకు సాగుకు రూ.75 వేలు జామ, మిరప పంటకు రూ.35 వేలు, బొప్పాయి, టమాట, పూల సాగుకు, ఉల్లికి రూ.25 వేలు, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, డ్రాగన్‌ ప్రూట్‌, జీడిమామిడి పంటలకు రూ.35 వేలు చొప్పున అందిస్తాం. ఫామాయిల్‌, కొబ్బరి చెట్టు కూలిపోతే రూ.15 వేలు చొప్పున చేయూత అందిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.


  • మీ కష్టం చూశా.. ఆదుకుంటా

8 బాధిత రైతులతో సీఎం ముఖాముఖి

‘‘మీకు జరిగిన నష్టాన్ని కళ్లారా చూశాను. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడం బాధాకరం. ప్రభుత్వపరంగా ఆదుకుంటాం. తగిన సాయం చేస్తాం’ అంటూ బాధిత రైతులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నవరసపురం గ్రామంలో తుఫాను కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. సుమారు 15 మంది రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. పంట వేసి ఎంత కాలమైంది, ఇంకా ఎన్ని రోజులైతే చేతికొచ్చేది, పెట్టుబడి తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని రైతు ఈదా దేవానంద్‌ సీఎంను కోరారు. ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందని, అలా కాకుండా ఇన్సూరెన్స్‌ కట్టి, మిగిలిన మొత్తాన్ని జమ చేస్తే విపత్తులు వచ్చినప్పుడు రైతులకు బీమా వస్తుందని రైతు పెన్మత బాపిరాజు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించాలని రైతు మల్లు వెంకటేశ్వరరావు అభ్యర్థించారు. పశువుల పేడతో తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం మంచి ఫలితాలు ఇస్తోందని రైతు అంకెల వర్దని సీఎంకు తెలిపారు.

ఎప్పటిలాగే అన్నదాత సుఖీభవ

‘‘ప్రధాన మంత్రి కిసాన్‌ యోజనకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు సొమ్ములను జత చేసి రూ.20 వేలు ఇస్తున్నాం. ఇప్పుడు రెండోవిడత పంపిణీ జరుగుతోంది. పెన్షన్లు యధావిధిగా పంపిణీ చేస్తాం. ఇవన్ని రొటీన్‌గా జరుగుతాయి. ఎన్నికలు ఉన్నా, తుఫాన్‌ ఉన్నా సరే ఏ వ్యక్తీ ఇబ్బంది పడకూడదు. నిత్యం పర్యవేక్షణ చేసి ప్రజలకు న్యాయం చేస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 03:40 AM