ముద్రగడ మృతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
ABN , Publish Date - Jul 14 , 2026 | 08:25 PM
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రజ్యోతి, జులై 14: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
'మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.' అని చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని వెలిబుచ్చారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. 'శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ముద్రగడ మృతికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ .. ముద్రగడ పద్మనాభం మృతి బాధాకరమన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తన సందేశంలో మాధవ్ పేర్కొన్నారు.
Also Read:
ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా