అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం!
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:35 AM
అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బాధితులు అధైర్యపడవద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘అర్నబ్’ బాధితులకు అండగా ఉంటాం: సీఎం
3 జిల్లాల్లో హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ
నీటమునిగిన వరి, అరటి, కొబ్బరి తోటల పరిశీలన
ఆక్వా చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా..
కోనసీమలో క్షేత్రస్థాయి పర్యటన
బాధిత రైతులతో ముఖాముఖి
పునరావాస కేంద్రంలో బాధితులకు పలకరింపు
కొబ్బరి చెట్టుకు రూ.1500 పరిహారం: సీఎం
నేడు మొగల్తూరులో పర్యటన
కాకినాడ/అమలాపురం/అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బాధితులు అధైర్యపడవద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ఆయన.. కాట్రేనికోన మండలంలోని వేట్లపాలెం, గచ్చకాయలపొర, చెయ్యేరు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ధైర్యం చెప్పారు. పునరావాస శిబిరాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అతి తీవ్ర తుఫాన్ తీరం దాటే వరకు అనుక్షణం గమనిస్తూ.. సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ.. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలన్న లక్ష్యం పెట్టుకుని పనిచేశామని.. అది మంచి ఫలితం ఇచ్చిందని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం లేకుండా చేయగలిగామన్నారు. తుఫాన్ తీరం దాటడానికి ముందురోజు 30 వేల మంది అధికారులతో సమీక్షించానని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు చనిపోయారని, ఇది బాధిస్తోందని తెలిపారు.
సహాయ చర్యలు బాగున్నాయా..?
చెయ్యేరు, వేట్లపాలెంలో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు తుఫాన్ ధాటికి నేలకొరిగాయి. సీఎం వాటిని పరిశీలించి అన్నదాతలతో మాట్లాడారు. పంటలకు బీమా చేయించారా లేదా అని అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. గచ్చకాయలపొర గ్రామంలో పునరావాస కేంద్రానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. అధికారులు చేపడుతున్న సహాయ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో ఆరాతీశారు. కాగా,రహదారులు, విద్యుత్, వ్యవసాయ పంటలు, ఇతర మౌలిక సదుపాయాలకు ప్రాథమికంగా రూ.4,600 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారని సీఎం చెప్పారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు