Share News

సీట్ల సర్దుబాట్లు స్థానికంగానే!

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:50 AM

కూటమి పార్టీల నేతల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే అప్పగించాలని నిర్ణయించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది.

సీట్ల సర్దుబాట్లు స్థానికంగానే!

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటుపై జిల్లా నేతలు, సమన్వయ కమిటీలకు బాధ్యత

  • నేడు జడ్పీ చైర్మన్‌ సీట్ల పంపకంపై నిర్ణయం.. కూటమి ఐక్యతకే ప్రాధాన్యం

  • ధిక్కరిస్తే చర్యలే.. జనసేనకు 6 జడ్పీలు కేటాయించే అవకాశం

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీల నేతల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే అప్పగించాలని నిర్ణయించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ చైర్మన్‌, 659 జడ్పీటీసీ స్థానాలు, 660 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలపై కూటమి పార్టీల నడుమ అవగాహన కుదరాల్సి ఉంది. బీజేపీకి జడ్పీ చైర్మన్‌ స్థానాలు ఏవీ కేటాయించే అవకాశం లేదని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జనసేనకు 6 జడ్పీ చైర్మన్‌ స్థానాలు కేటాయించనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నుంచి ఆదివారం తిరిగి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు మన్యం, అనకాపల్లి జిల్లా జడ్పీ స్థానాలతోపాటు మరో నాలుగు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.


సమన్వయ కమిటీలకే బాధ్యత

జడ్పీటీసీలు, ఎంపీటీసీల సర్దుబాటు బాధ్యత స్థానిక జిల్లా నాయకత్వాలకు ముఖ్యంగా సమన్వయ కమిటీలకు అప్పగించాలని కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలు నిర్ణయించారు. గత రెండు రోజులుగా అగ్రనేతల మధ్య జరుగుతున్న చర్చలకు కొనసాగింపుగా శనివారం కూడా కూటమి నేతలు సీఎం చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. బీజేపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, జనసేన తరపున రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ సీట్ల సర్దుబాట్లపై టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించి మిగిలిన స్థానాల బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించాలని నిర్ణయించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు ఎవరికి కేటాయించాలన్న అంశంపై జిల్లా నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు సమన్వయ కమిటీలతో చర్చించి స్థానిక బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని మూడు పార్టీల నేతలు భావించారు. చాలా చోట్ల 3 పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు వేసిన నేపథ్యంలో, కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిన వెంటనే మిగిలిన వారిని నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూసే బాధ్యత కూడా జిల్లా నాయకత్వానికే అప్పగించనున్నారు. ఈ క్రమంలో ఎక్కడా కూటమి ఐక్యతకు విఘాతం కలిగేలా నిర్ణయాలు తీసుకోవద్దని, కూటమి ఐక్యతను ధిక్కరించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సమన్వయ కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:50 AM