Share News

సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే భారీగా పెట్టుబడులు: ఎమ్మెల్యే గంటా

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:53 PM

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతోందని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, నారా లోకేశ్ కృషి, పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే భారీగా పెట్టుబడులు: ఎమ్మెల్యే గంటా
Andhra Pradesh Investments

విశాఖపట్నం, నవంబరు 14: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని, కేవలం రెండు రోజుల సదస్సులోనే రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు. రీజినల్ సమ్మిట్‌ల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం పెట్టుబడిదారులకు మరింత భరోసానిస్తోందని అన్నారు.


గ్రామ స్థాయిలోనూ క్లీన్‌స్వీప్ చేస్తాం..

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మకమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం వన్‌సైడ్‌గా నిలిచిందని.. గతంలో ఎన్టీఆర్ సాధించిన రికార్డులను మించి.. ఈసారి అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించడం విశేషమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం, సీఎం చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఈ ఘన విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, ఇదే ప్రజాభిమానం రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమికి విశేష ఆదరణ ఉందని, గ్రామస్థాయి ఎన్నికల్లో సైతం కూటమి ఘన విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేస్తుందని గంటా శ్రీనివాసరావు విశ్వాసం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి

నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు

Updated Date - Nov 14 , 2026 | 04:06 PM