12వ పీఆర్‌సీ కసరత్తు షురూ
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:36 AM
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 12వ వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) తన విధివిధానాలు వెల్లడిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.
విధివిధానాలు ప్రకటించిన సంఘం
డిసెంబరు 31లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలకు అవకాశం
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 12వ వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) తన విధివిధానాలు వెల్లడిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ విధివిధానాలపై సంబంధిత వర్గాలు తమ సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను డిసెంబరు 31లోగా వెల్లడించాలని కోరింది. కాగా, యూజీసీ/ఏఐసీటీఈ/ఐకార్ స్కేళ్లు పొందుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల బోధనా సిబ్బంది, రెండవ జాతీయ న్యాయవేతన సంఘం స్కేళ్లు పొందుతున్న న్యాయాధికారులు ఈ కమిషన్ పరిధిలోకి రారు.
పీఆర్‌సీ దృష్టి సారించే అంశాలు
వేతనాలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల బోధనేతర సిబ్బంది(ఆచార్య ఎన్జీరంగా, జేఎన్టీయూతో సహా), వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులు, పూర్తికాలపు కంటింజెంట్ ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలపై సిఫారసులు చేస్తారు.
డీఏ విలీనం: ప్రస్తుతం ఉన్న కరువు భత్యాన్ని మూలవేతనంలో ఎంతవరకు విలీనం చేయవచ్చో పరిశీలించి, కొత్త పేస్కేళ్లను నిర్ణయిస్తారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్: ఈ పథకం అమల్లో ఎదురవుతున్న లోపాలను అధ్యయనం చేసి, దీనిని కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనేదానిపై సూచనలు ఇస్తారు.
ప్రత్యేక భత్యాలు: ప్రస్తుతం అమల్లో ఉన్న స్పెషల్ పే, కాంపెన్సేటరీ అలవెన్సులు, ఇతర భత్యాల అవసరాన్ని సమీక్షించి వాటి రేట్లు, నిబంధనలపై సిఫారసులు చేస్తారు. పెన్షనర్ల ప్రస్తుత పింఛను విధానాన్ని సమీక్షించి తగిన మార్పులు సూచిస్తారు. ఏదైనా కేటగిరీ పోస్టులను గెజిటెడ్ విభాగంలోకి మార్చడానికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో సహా శాఖల్లోని మానవవనరుల అవసరాలను సమీక్షిస్తారు.
ఆర్థిక పరిస్థితి: ఈ సిఫారసులన్నింటినీ రూపొందించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్