Share News

విద్యుత్‌, ఆరోగ్య శాఖలు అప్రమత్తం

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:52 AM

‘ఆర్నబ్‌’ తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌, ఆరోగ్య శాఖలు అప్రమత్తం

25 వేల విద్యుత్‌ స్తంభాలు, ఇతర సామగ్రి సిద్ధం

కీలక సిబ్బందికి సెలవులు రద్దు

మంత్రులు గొట్టిపాటి, అనిత సమీక్ష

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్‌’ తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంతులు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిబ్బంది, ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలపై డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో మంత్రులు ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీవర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుఫాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్థరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 వేల విద్యుత్‌ స్తంభాలతో పాటు ఇతర సామగ్రిని సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. విద్యుత్‌ ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.

ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను తొలగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు, సరఫరా సమస్యలు ఎదురైతే 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని కోరారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వ సంస్థలు అధికారికంగా జారీ చేసే సూచనలను పరిగణలోకి తీసుకుని, ప్రజలు అప్రమత్తంగా ఉందాలని కోరారు.


క్షేత్రస్థాయిలో అధికారుల మకాం!

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌ శాఖలు హైఅలర్ట్‌ ప్రకటించాయి. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ ఆదివారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి తుఫాను ప్రభావం తగ్గి పరిస్థితులు చక్కబడే వరకు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని విజయానంద్‌ ఆదేశించారు. జోనల్‌ చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు, విపత్తు నిర్వహణలో పాల్గొనే కీలక సాంకేతిక సిబ్బందికి ఎలాంటి సెలవులూ మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జెన్కో ఎండీ ఎస్‌. నాగలక్ష్మి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • అప్రమత్తంగా ఉండండి

డీఎంహెచ్‌వోలకు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ ఆదేశం

తుఫాను ప్రభావం దృష్ట్యా 27 నుంచి 30 వరకు ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక, గ్రామస్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు. వ్యాధులతో బాధపడేవారికి వైద్య సేవల్లో అంతరాయం కలగకూడదని సూచించారు. మంత్రి సూచనల మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ‘జిల్లాల్లో 24 గంటలూ పనిచేసే అత్యవసర నియంత్రణ గదులు ఏర్పాటు చేయాలి. వరద ముప్పు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది, మందులు, పరికరాలు, విద్యుత్తు, నీటి సదుపాయాలను తనిఖీ చేయాలి.

వైద్య సిబ్బందికి విధులు కేటాయించి అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. రెవెన్యూ, పోలీస్‌, ఇతర శాఖలతో పాటు 108, 104, 102 సేవలతో సమన్వయం చేసుకోవాలి. దెబ్బతిన్న వైద్యపరికరాలు, సదుపాయాలకు మరమ్మతులు చేపట్టాలి. జిల్లా స్థాయిలో సన్నద్ధత, సమన్వయం, పర్యవేక్షణ బాధ్యత జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులదే’నని కమిషనర్‌ స్పష్టం చేశారు. ప్రమాదంలో ఉన్న కుటుంబాలను గుర్తించడం, ప్రజలకు హెచ్చరికలు ఇవ్వడం, వ్యాధులపై నిఘా, సమాచార నివేదికల బాధ్యతలు గ్రామస్థాయి సిబ్బంది నిర్వహించాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:52 AM