Share News

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:04 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, అభ్యర్థులను బెదిరించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హెచ్చరించారు.

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

  • అడ్డగింతలు, బెదిరింపులకు పాల్పడితే సహించం: డీజీపీ

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, అభ్యర్థులను బెదిరించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, నామినేషన్‌ కేంద్రాల వద్ద గుంపులుగా చేరి విధులకు ఆటంకం కలిగించడం, రహదారులను దిగ్బంధించడం, పోలీసుల ఆదేశాలను ధిక్కరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించి 14 ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇప్పటివరకు 17మంది నిందితులను గుర్తించి కేసులు నమోదు చేశామని చెప్పారు.

పల్నాడు, కడప జిల్లాల్లో మూడేసి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘటన చోటుచేసుకున్నాయని చెప్పారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసి, మరింతమంది నిందితుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులైన అధికారులను జవాబుదారీ చేస్తామని హెచ్చరించారు. బారికేడ్లను దాటడం, నామినేషన్‌ కేంద్రాలను చుట్టుముట్టడం, పోలీసులపై దాడులకు దిగడం, ప్రత్యర్థులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

  • సీసీ కెమెరాలు, డ్రోన్‌ ఫుటేజీతో నిందితుల గుర్తింపు

ఎన్నికల హింసకు సంబంధించి సీసీ కెమెరాలు, డ్రోన్లు, పోలీసుల బాడీ కెమెరాలు, నామినేషన్‌ కేంద్రాల్లో చిత్రీకరించిన వీడియోలు, మీడియా, ప్రజల నుంచి లభించిన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ఘటనాస్థలం నుంచి పారిపోయినా, గుంపులో దాక్కున్నా నేర బాధ్యత నుంచి తప్పించుకోలేరని హెచ్చరించింది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తామని, హింస, బెదిరింపులు, వ్యవస్థీకృత అడ్డంకులను సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:04 AM